న్యూఢిల్లీ: అమెరికాలో భారత సంతతి మహిళను ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె 30 ఏండ్లుగా అక్కడ ఉంటుండగా, గ్రీన్ కార్డు కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన టైమ్‌లో అదుపులోకి తీసుకున్నారు. బబ్లిజిత్ (బబ్లీ) కౌర్, ఆమె భర్త 1994లో అమెరికాకు వలస వెళ్లారు. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. బబ్లీ భర్తకు, మరో ఇద్దరు పిల్లలకు గ్రీన్ కార్డు ఉంది.
పెద్ద కూతురు జ్యోతికి అక్కడ నివసించేందుకు లీగల్ స్టేటస్ ఉంది. ఈ క్రమంలో బబ్లీ కూడా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నది. ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఇక చివరి రౌండ్‌లో భాగంగా డిసెంబర్ 1న బయోమెట్రిక్ స్కాన్ కోసం ఇమిగ్రేషన్ ఆఫీసుకు వెళ్లింది. అదే టైమ్‌లో అక్కడికి వచ్చిన ఫెడరల్ అధికారులు.. బబ్లీని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమెను తమ అదుపులోనే ఉంచుకున్నారు. అయితే, అసలు ఎందుకు అరెస్టు చేశామనేది చెప్పలేదు. లాయర్, కుటుంబసభ్యులతో మాత్రం మాట్లాడేందుకు అనుమతించారు.
