కీసర, వెలుగు: నాగారం డివిజన్ రాంపల్లిలోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం హైడ్రా స్వాధీనం చేసుకొని వాటర్ బోర్డుకు అప్పగించింది. రాంపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 388లో మొత్తం 32.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, గత కొన్నేండ్లుగా ఇక్కడ దళిత, బీసీ కులాలకు చెందిన పలు కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఇందులోని 4 ఎకరాలను సీవరేజ్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం కోసం వాటర్ బోర్డుకు రెవెన్యూ అధికారులు కేటాయించారు.
దీంతో గత 4 రోజులుగా భూమి బాధితులు కంచె వేయడాన్ని అడ్డుకుంటూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం హైడ్రా ఇన్స్పెక్టర్ సైదులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చి భూమిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ సిమెంట్ కడ్డీలు పాతి కంచె వేశారు. అభ్యంతరం తెలిపిన సుమారు 14 మందిని అదుపులోకి తీసుకుని జవహర్‌నగర్ పీఎస్కు తరలించారు.
