
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడ్డ హైడ్రా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో అంబర్ పేట బతుకమ్మ కుంటకు జీవం పోసింది హైడ్రా. 5 ఎకరాల 15 గుంటల వితీర్ణంలో చెట్లు, చెత్తతో నిండిపోయిన కుంటను పునః నిర్మించింది హైడ్రా. సెప్టెంబర్ లో బతుకమ్మ పండుగకు సీఎం రేవంత్ చేతుల మీదుగా అంబర్ పేట బతుకమ్మ కుంటను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు అందుకుంటున్న హైడ్రా.. హైదరాబాద్ వ్యాప్తంగా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో అంబర్ పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులను హైడ్రా మొదలు పెట్టింది. పునరుద్ధరణ లో భాగంగా ఫిబ్రవరి 18న బతుకమ్మ కుంటలో హైడ్రా పూడిక తీత పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కుంటలో జేసీబీతో కొంత మేర మట్టి తీయగానే నీళ్లు బయటకు వచ్చాయి.
అంబర్ పేట మండలం బాగ్ అంబర్ పేట్ లోని సర్వే నంబరు 563 లో 1962- -63 లెక్కల ప్రకారం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్ తో కలిపి మొత్తం16.13 ఎకరాలు. అయితే తాజా సర్వే ప్రకారం అక్కడ 5.15 ఎకరాలు మాత్రమే మిగిలింది. దీన్ని హైడ్రా పనరుద్దరించేందుకు చర్యలు చేపట్టింది.
ఇక్కడ ఉంటున్న వారికి సమస్య లేకుండా చెరువును పునరుద్ధరించనున్నారు అధికారులు. బ్యూటిఫికేషన్చేపట్టనున్నారు. ఒకప్పటి ఎర్రకుంటనే కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయిందంటున్నారు.