ఆక్రమణలపై హైడ్రా మరోసారి పంజా విసిరింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేసిన లేఔట్లను తొలగించి వందల కోట్ల విలువైన స్థలాన్ని కాపాడింది. సోమవారం (జనవరి 19) మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలంలో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. ఏడాది క్రితం అడ్డు గోడలు తొలగించిన అదే ప్రాంతంలో లేఔట్లు వేయటంతో యాక్షన్ లోకి దిగిన హైడ్రా.. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.
ఘట్ కేసర్ మండలం కాచవాణి సింగారం గ్రామంలోని దివ్యానగర్ లే ఔట్‌లో 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడారు హైడ్రా అధికారులు. నల్లమల్లారెడ్డి భూ అక్రమాలపై మరోసారి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేని లేఔట్ వేసి ప్లాటింగ్ చేసినట్టు ఆరోపణలు రావటంతో హైడ్రా రంగంలోకి దిగింది. అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయించిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.
Also Read : ఇప్పటికే ట్రాఫిక్ జామ్‌తో టార్చరంటే మళ్లీ ఇదొకటి
సర్వే నంబర్లు 66/2, 66/3, 66/4, 66/5లో మొత్తం 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి ఫెన్సింగ్ వేశారు అధికారులు. ప్రభుత్వ భూమిలోకి చొరబడి దాదాపు 50 వరకు ప్లాట్లు వేసినట్టు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదులతో హైడ్రా అధికారులు ఆక్రమణలను పరిశీలించారు. సర్వే ల్యాండ్ రికార్డుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు. నోటీసులు ఇవ్వలేదంటూ నల్లమల్లారెడ్డి చేసిన అభ్యంతరాలు విఫలమయ్యాయి. ఫెన్సింగ్‌తో పాటు ప్రభుత్వ భూమిగా హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు.
