హైదరాబాద్: సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లిన జనం పట్నం బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే (ఎన్హెచ్ 65)పై సోమవారం (జనవరి 19) రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలో మీటర్ల మేర వెహికల్స్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పెద్దఅంబర్ పేట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును మరో ఆర్టీసీ బస్సు వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆర్టీసీ బస్సు, కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
