ఆధార్ అప్ డేట్ అంటూ ఒకసారి, బ్యాంకు కేవైసీ అంటూ మరోసారి.. ఆన్ లైన్ పెట్టుబడులు అంటూ ఇంకోసారి.. ఇలా పలు రకాలుగా మెసేజులు పంపిస్తూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్న సైబర్ నేరస్తులు.. ఈ సారి ఏకంగా డీసీపీనే సైబర్ వలలో పడేద్దామనుకున్నారు. ఓటీపీ చెప్పండి.. ఇన్వెస్ట్ చేయండంటూ లింక్ క్లిక్ చేయమని.. క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ ను కంట్రోల్ లోకి తీసుకుని బ్యాంకు బ్యాలెన్స్ క్లీన్ స్వైప్ చేసే సైబర్ క్రిమినల్స్.. డీసీపీ శిల్పవల్లికి ట్రాఫిక్ చలాన్ల పేరున మెసేజ్ పంపారు.
సైబర్ నేరస్తుల పన్నాగం గుర్తించిన ఐపీఎస్ శిల్పవల్లి.. వాళ్ల బుట్టలో పడలేదు. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ లో పోస్ట్ చేశారు. 96782.. అనే నెంబర్ నుంచి మూడు రోజుల్లో రెండు మెసేజులు వచ్చాయి. రెండూ వేర్వేరు లింకులతో ఉన్న ఆ మెసేజులలో ఉన్న లింకులను నేను క్లిక్ చేయలేదు.. అని ఆమె చెప్పారు. ఆ మెసేజ్ లు అలాగే స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ మెసేజ్ లలో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.
మేసేజ్లలో ఏముంది..?
స్పీడ్ కెమెరా మీ వాహనం వేగంగా వెళ్తున్నట్లు గుర్తించింది. ఈ లింకు క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోండని ఒక మెసేజ్ లో ఉంది.
ట్రాఫిక్ మేనేజ్మెంట్ నుంచి అని టైప్ చేసి.. 2026 జనవరి, 10 వ తేదీన మీ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు రికార్డయ్యింది. లింకులో పూర్తి వివరాలు చూడండి. జాగ్రత్తగా నడపండి.. అంటూ మరో మెసేజ్ లో టైప్ చేసి పంపించారు.
డీసీపీ ఏం చేశారు..?
మెసేజ్ లు ఫ్రాడ్స్టర్స్ పంపినవిగా అనుమానించిన డీసీపీ.. లింకు క్లిక్ చేయకుండా నేరుగా సంచార్ సాథీ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె సైబర్ ఫ్రాడ్ లో పడకుండా తప్పించుకున్నారు.
మీకు కూడా ఇలాంటి అనుమానాస్పద మెసేజ్ లు వస్తే.. లింక్ క్లిక్ చేయకుండా ఫిర్యాదు చేయండి. అందుకోసం https://www.sancharsaathi.gov.in/ లో ఫిర్యాదు చేయండి.
