భారత్, చైనాలు ప్రత్యర్థులుగా కాకుండా పాట్నర్‎గా చూసుకోవాలి: విదేశాంగ మంత్రి వాంగ్ యీ

భారత్, చైనాలు ప్రత్యర్థులుగా కాకుండా పాట్నర్‎గా చూసుకోవాలి: విదేశాంగ మంత్రి వాంగ్ యీ

బీజింగ్: భారత్, చైనా ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూసుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపునిచ్చారు. ఆదివారం బీజింగ్‌‌లో జరిగిన చైనా పార్లమెంట్ వార్షిక సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్‌‌ నిర్దేశించిన మార్గంలోనే ఇరుదేశాలు పయనించాలని సూచించారు. 2024లో రష్యాలోని కజాన్‌‌, టియాంజిన్‌‌లో జరిగిన మోదీ-, జిన్‌‌ పింగ్ సమావేశాలు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య అన్ని స్థాయిల్లో చర్చలు మళ్లీ పుంజుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 

ద్వైపాక్షిక వాణిజ్యం సరికొత్త రికార్డులను సృష్టించిందని, ప్రజల మధ్య సంబంధాలు బలపడడం ఇరుదేశాలకు మేలు చేస్తోందన్నారు. పొరుగు దేశాలుగా శాంతియుత సంబంధాలను కొనసాగించాలని, సరిహద్దుల్లో సుస్థిరతను కాపాడుకుంటూ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ ఏడాది భారత్ లో నిర్వహించనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం, 2027లో చైనా నిర్వహించనున్న సదస్సుకు ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ఆసియా ఖండం పునరుజ్జీవనం పొందాలంటే భారత్, చైనా మధ్య పరస్పర సహకారం అత్యవసరమన్నారు.