న్యూఢిల్లీ: యుద్ధం ఎఫెక్ట్‌తో మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు గల్ఫ్ దేశాల నుంచి 50 వేల మంది ఇండియన్లను సేఫ్‌గా తీసుకువచ్చినట్లు మన దేశ విదేశాంగ శాఖ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది ట్రాన్సిట్, విజిట్ వీసాపై గల్ఫ్ దేశాలకు వెళ్లినవాళ్లే ఉన్నారని వెల్లడించింది. గడిచిన మూడ్రోజుల్లో ఒక్క యూఏఈ నుంచి 7 వేల మందిని ఇండియాకు తరలించామంది. ట్రాన్సిట్, టూరిస్ట్ వీసాలపై వెళ్లి.. గడువు ముగిసినవాళ్లకోసం, ఎయిర్‌పోర్టుల్లో విమానాల కోసం వేచి చూస్తున్నవాళ్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొంది.
జెడ్డా, మస్కట్‌కు విమానాలు నడుపుతున్నామని, దుబాయ్, అబుదాబి, రస్ అల్‌ఖైమా, షార్జా నుంచి ప్రయాణికులను తరలించేందుకు 30కిపైగా అదనపు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ఢిల్లీ, ముంబై నుంచి దుబాయ్‌కి స్పెషల్ ప్లేన్లు నడిపిస్తున్నామని తెలిపింది. రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి టికెట్ల డబ్బులు పూర్తిగా రీఫండ్ చేస్తున్నామని, రీబుకింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.
యుద్ధం ఎఫెక్ట్‌తో కొనసాగుతున్న విమానాల రద్దు
గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేత కారణంగా విమానాల రద్దు కొనసాగుతోంది. అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైల్ దాడులు కొనసాగుతున్నందున ఖతార్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ వంటి దేశాలు ఎయిర్‌స్పేస్‌ను క్లోజ్ చేశాయి. దీంతో దుబాయ్, అబుధాబి, దోహా, కువైట్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల నుంచి వేల విమానాల రాకపోకలు రద్దయ్యాయి.
అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ మాత్రం అత్యవసర సేవల కోసం పరిమిత సంఖ్యలో విమానాలు నడుపుతున్నాయి. బహ్రెయిన్, దోహా, కువైట్, రియాద్ ఎయిర్‌పోర్టులకు విమానాలను ఈనెల 13 వరకు పూర్తిగా రద్దుచేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. సౌదీ, దోహా, రియాద్‌కు అన్ని ఫ్లైట్లను మార్చి 10 వరకు రద్దు చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా మాత్రం ఎంపిక చేసిన రూట్లలో కొన్ని విమానాలను జెడ్డా, మస్కట్, అబుధాబికి నడుపుతున్నాయి.
