‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో రోల్ మోడల్ గా తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు

‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో రోల్ మోడల్ గా తెలంగాణ :  మంత్రి శ్రీధర్ బాబు
  • భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’ వ్యూహం
  • నేరాల జరగకముందే అడ్డుకునేలా ‘ప్రిడిక్టివ్ పోలీసింగ్’కు ప్రాధాన్యం
  • తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్‌‌ 2026’లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: ‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో పోలీసులకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ట్రిపుల్ టీ(టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్) వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆదివారం తెలంగాణ పోలీస్ అకాడమీలో ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఒకప్పుడు పోలీసింగ్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమేనని, ఇప్పుడు డేటా సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్ గా రూపాంతరం చెందిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరం చేసే విధానం కూడా డిజిటల్ రూపంలోకి విస్తరించిందని తెలిపారు. డీప్‌ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ స్కామ్‌లు పోలీసులకు సవాల్‌గా మారాయన్నారు. ప్రస్తుతం నేరగాళ్లకు ఆయుధాలతో పనిలేదని, స్మార్ట్ ఫోన్, డేటా, డిజిటల్ ఐడెంటిటీస్ తో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. 

రూ.22,845 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు

2024లో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845 కోట్లు కొల్లగొట్టారని, గతేడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువన్నారు. సైబర్ బాధితుల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్ రెడీనెస్, లీడర్‌ షిప్, ఇన్నోవేషన్, ఎథిక్స్ తో కూడిన ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో డేటా అనలిటిక్స్, ఏఐ సాయంతో నేరాలు జరగకముందే అంచనా వేయడం కోసం అధునాతన పోలీసింగ్​విధానం ‘ప్రిడిక్టివ్ పోలీసింగ్’కు పెద్దపీట వేస్తామని తెలిపారు.

‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. నక్సలిజంపై పోరాటంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను ఈ సందర్భంగా మంత్రి స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిష్త్, రిటైర్డ్ డీజీపీలు హెచ్ జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.