ఇజ్రాయెల్‌‌కు 12 వేల బాంబులు విక్రయానికి అమెరికా ఆమోదం

ఇజ్రాయెల్‌‌కు 12 వేల బాంబులు విక్రయానికి అమెరికా ఆమోదం

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్‌‌కు 12వేల ఎయిర్ డ్రాప్డ్ బాంబులను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 151.8 మిలియన్ డాలర్లు (సుమారు 1,270 కోట్లు) ఉంటుందని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే ‘బీఎల్‌‌యూ 110’ రకం బాంబులను అగ్రరాజ్యం సరఫరా చేయనుంది. సాధారణంగా ఇటువంటి ఆయుధ విక్రయాలకు అమెరికా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. 

అయితే, ఇరాన్‌‌తో కొనసాగుతున్న యుద్ధం దృష్ట్యా జాతీయ ప్రయోజనాలను  పరిగణనలోకి తీసుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తనకున్న అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ విక్రయానికి తక్షణం ఆమోదం తెలిపారు. దీనితోపాటు సాంకేతిక సహాయం, ఇంజనీరింగ్ సపోర్ట్, లాజిస్టిక్స్ సేవలనూ అమెరికన్ కాంట్రాక్టర్లు అందించనున్నట్టు పెంటగాన్ తెలిపింది. 

ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇరాన్‌‌లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై భారీగా వైమానిక దాడులు చేస్తున్నది. ఈ ఆపరేషన్లలో ఇజ్రాయెల్ తన సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు అమెరికా ఈ సహకారాన్ని అందిస్తున్నది. అయితే, ఈ ఆయుధ విక్రయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సరఫరాల వల్ల యుద్ధం మరింత కాలం కొనసాగే  ప్రమాదం ఉందని కొందరు వాదిస్తున్నారు.