బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు కేరళ ఎన్నికలకు తెలంగాణ పైసలా?: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు కేరళ ఎన్నికలకు తెలంగాణ పైసలా?: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  • చమురు నిల్వలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం 
  • యుద్ధం జరిగినా దేశంలో ఇంధన కొరత రాదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, బీఆర్ఎస్‌తో పొత్తు అనే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆదివారం మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రాంచందర్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు  మాట్లాడుతూ.. తెలంగాణ ఖజానా ఖాళీ అయిందని రోజూ చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నదని విమర్శించారు.

కేరళలో జరుగుతున్న ఎన్నికల కోసం ఫుల్ పేజీ కలర్ అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమై, కేరళలో ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు.

 ఇరాన్, -ఇజ్రాయెల్ యుద్ధం సాకుతో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నదని రాంచందర్ రావు విమర్శించారు. యూపీఏ హయాంలో కేవలం 16 దేశాల నుంచే ఆయిల్ వచ్చేదని, కానీ ప్రధాని మోదీ దౌత్యంతో ఇప్పుడు 47 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు.

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా భారత్‌లో ఇంధన కొరత రాదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సరిపడా బఫర్ స్టాక్ ఉందని, గ్యాస్ సిలిండర్ ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో 2012లో ఇరాన్ నుంచి ఆయిల్ సరఫరా నిలిచిపోయిందని, అప్పట్లో దేశం తీవ్ర ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు. బ్రెంట్ క్రూడ్ ధరలు 9 శాతం పెరిగినా దేశంలో ధరలు స్థిరంగా ఉండడమే మోదీ పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. 

చైనాతో  కాంగ్రెస్ పార్టీ రహస్య ఒప్పందాలు

కాంగ్రెస్ పార్టీ చైనాతో రహస్య ఒప్పందాలు చేసుకుని దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్.. ప్రజలను మోసం చేశాయని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.  రాష్ట్రపతిని గౌరవించకుండా, ప్రొటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని రాంచందర్ రావు విమర్శించారు. 

బీఆర్ఎస్​కు ఫ్యూచర్ లేదు: విశ్వేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో బీఆర్ఎస్​కు ఫ్యూచర్ లేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో ఉన్నామని, ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్​లో ఉండాలని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంటూ కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా బీఆర్ఎస్ నుంచి బీజేపీ చేరికలు ఆపడానికి మాత్రమేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని అవకాశమే లేదన్నారు.