సోషల్ మీడియాలో వైరల్..వెరీ డేంజర్

సోషల్ మీడియాలో వైరల్..వెరీ డేంజర్

హైదరాబాద్,వెలుగుచట్టాలు ఎన్ని వచ్చినా,శిక్షలు ఎంత కఠిన తరం చేసినా హత్యోదంతాలకు అంతులేకుండా పోతోంది. ఆస్తి తగాదాలు,ఆర్థిక లావాదేవీలు, ప్రేమోన్మాదుల దాడులు, ప్రేమజంటలపై జరుగుతున్న పరువు హత్యలు నేటి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ఘటనలు. ఏడాది కాలంగా జరుగుతున్న పరువు హత్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య మొదలు శుక్రవారం ఎస్సార్ నగర్ లో జరిగిన ఇంతియాజ్ పై హత్యాయత్నం వరకు తీవ్ర కలకలం రేపాయి. వీటికి తోడు పాత కక్షలు,రౌడీ మూకల ఆధిపత్య పోరు వరుస హత్యలకు దారితీస్తున్నాయి.

సీసీ ఫుటేజ్, సోషల్ మీడియాలో వీడియోలు

ఇలాంటి దారుణాలకు సోషల్ మీడియాలో గతంలో జరిగిన వీడియోలు వైరల్ అవడమూ కొంత కారణమని పోలీసులు,సామాజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడం కూడా మరో కారణమని వారు అంటున్నారు. ఏదైనా ఘటన జరిగితే దానికి సంబంధించిన దృశ్యాలు క్షణాల్లో స్మార్ట్ ఫోన్స్ లో దర్శనమిస్తున్నాయి. ఘటనా స్థలంలో ఉన్న జనాల్లో కొందరు దాన్ని అడ్డుకోకుండా స్మార్ట్ ఫోన్లలో వీడియో తీసి వైరల్ చేస్తున్నారు. దీనికి తోడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్న హత్యలు, దాడుల వీడియో ఫుటేజ్ వైరల్ అవుతుండడంతో ఆ ప్రభావం సమాజంపై తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. చట్టాలు,పోలీసులను లెక్క చేయకుండా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

ప్రణయ్ హత్యతో మొదలు

మిర్యాలగూడలో గతేడాది ప్రణయ్ హత్య తరువాత జరిగిన ఒక్కో హత్యోదంతం సోషల్ మీడియా వల్ల ప్రభావితమైనవేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పరువు హత్యలు,పాతకక్షలు  ప్రధాన కారణాలు. ప్రణయ్ హత్య సీసీ ఫుటేజ్ బయటికి వచ్చిన తరువాత అదే తరహాలో గతేడాది సెప్టెంబర్19న ఎర్రగడ్డలో దాడి జరుగడంతో సిటీలో కలకలం రేపింది. ఆ రోజు అందరూ చూస్తుండగానే ఓ తండ్రి తన కూతురు, అల్లుడిపై అతి దారుణంగా దాడి చేశాడు. అల్లుడు సందీప్ గాయపడగా కూతురు మాధవి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైంది. ఈ వీడియోలు, సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయ్యాయి.

అత్తాపూర్ కేసులో పీడీ యాక్ట్ 

ఈ రెండు ఘటనలు మరువక ముందే సరిగ్గా వారం రోజులకు అత్తాపూర్ లో పాత కక్షలు పడగ విప్పాయి. ప్రణయ్ హత్య,ఎర్రగడ్డలో కన్న కూతురుపై తండ్రి చేసిన హత్యాయత్నం తరహాలోనే గతేడాది సెప్టెంబర్ 26న నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై దాడి జరిగింది. రాజేంద్ర నగర్ కోర్టులో కేసు విచారణకు హాజరై వస్తున్న రమేష్(35) ను పట్టపగలు అందరూ చూస్తుండగానే నలుగురు దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు.  ఈ హత్యలో పాల్గొన్న దుండగలు ఎలాంటి భయం లేకుండా రెచ్చిపోయారు. వీరిని కూడా ప్రణయ్, ఎర్రగడ్డ ఘటన సీసీ ఫుటేజ్ ప్రచారాలు ప్రభావితం చేశాయని పోలీస్ వర్గాలు గుర్తించాయి. ఈ కేసులో రాజేంద్ర నగర్ పోలీసులు ఛార్జిషీట్ ఫైల్ చేశారు. కోర్టులో విచారణ జరుగుతోంది.

సంగారెడ్డి ఘటన వైరల్ తో ఎస్సార్ నగర్ దాడి 

ఈ ఏడాది మే 31న సంగారెడ్డి జిల్లా రుద్రారంలో జరిగిన హత్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేషనల్ హైవే పై అందరూ చూస్తుండగానే ముషీరాబాద్ కు చెందిన మహబూబ్ అనే పాత నేరస్థుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యాఘటన దృశ్యాలను అక్కడే ఉన్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మరోసారి సిటీలో ప్రతీకార హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోల ప్రభావమే తాజాగా శుక్రవారం ఎస్సార్ నగర్ లో ప్రేమ జంటపై జరిగిన దాడి అని పోలీసులు భావిస్తున్నారు. ఇలా వరుసగా జరిగిన దారుణాలకు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉదంతాలు కారణాలవుతున్నాయని..ఇలాంటి పరువు, ప్రతీకార హత్య వీడియోలు, సీసీ ఫుటేజ్, ఫొటోలు సమాజంపై ప్రభావాన్ని చూపుతున్నట్టు పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.