IPLలో తోపు.. న్యూజిలాండ్‌లో కాదు.. వైభవ్‌కు కివీస్ కోచ్ డెడ్లీ వార్నింగ్ 

IPLలో తోపు.. న్యూజిలాండ్‌లో కాదు.. వైభవ్‌కు కివీస్ కోచ్ డెడ్లీ వార్నింగ్ 

Vaibhav Sooryavanshi: రాబోయే అక్టోబర్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు మైండ్ గేమ్‌లు మొదలయ్యాయి. టీమిండియా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) న్యూజిలాండ్ పర్యటనపై కీవీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ (Rob Walter) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్, అండర్-19 క్రికెట్‌లో విధ్వంసం సృష్టించిన ఈ యువ బ్యాటర్, న్యూజిలాండ్‌లోని ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్‌లపై ఎలా ఆడతాడో చూడటానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

ఫాస్ట్ పిచ్‌లపై వైభవ్ ఆట చూడాలి: రాబ్ వాల్టర్

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైభవ్ సూర్యవంశీ గురించి న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. వైభవ్ అత్యంత ఎగ్జైటింగ్ ప్లేయర్,  ఐపీఎల్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరును మనమంతా చూశాం.. కానీ విదేశీ కండిషన్స్‌లో, ముఖ్యంగా పేస్ అండ్ బౌన్స్ ఉండే కీవీస్ పిచ్‌లపై ఆ ప్రదర్శనను ఎలా పునరావృతం చేస్తాడో చూడటమే అసలైన సవాల్.. రహస్యంగా చెప్పాలంటే.. ఒక కోచ్‌గా ప్రత్యర్థి యంగ్ ప్లేయర్లను మా బౌలర్లు ఒత్తిడిలోకి నెట్టినప్పుడు వారు ఎలా స్పందిస్తారో చూడడం నాకు ఇష్టం.. మా సొంత గడ్డపై వైభవ్‌కు ఎలాంటి బౌలింగ్ వేయాలో మా వద్ద ప్లాన్స్ ఉన్నాయని పేర్కొన్నాడు. 

వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివేంజ్: 

ఈ సిరీస్ కేవలం ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాదని, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశమని కీవీస్ కోచ్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో ఓడిపోవడం ఎవరికైనా చాలా బాధను కలిగిస్తుంది. నేను రెండుసార్లు ఆ అనుభవాన్ని చూశాను.. సొంతగడ్డపై భారత జట్టును ఓడించి కొన్ని విజయాలు సాధిస్తే ఆ బాధ నుంచి రిలీఫ్ లభిస్తుంది. కీవీస్ అభిమానుల కోసం సిరీస్ గెలవడమే మా లక్ష్యం అని వాల్టర్ వెల్లడించాడు.