పంజాబీలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా -రాహుల్ గాంధీ

పంజాబీలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా -రాహుల్ గాంధీ

1977లో మా నానమ్మను కాపాడిన్రు -ఖేతీ బచావో యాత్రలో రాహుల్​

న్యూఢిల్లీ, పటియాల(పంజాబ్): ‘1977 ఎన్నికల్లో నానమ్మ ఓడిపోయినపుడు మా ఇల్లంతా ఖాళీ అయింది. అప్పుడు మాకు సెక్యూరిటీగా నిలుచున్నది సిక్కులే. పంజాబీలకు నేనెంతో రుణపడి ఉన్నా’ నని కాంగ్రెస్ మాజీ చీఫ్,​ ఎంపీ రాహుల్​ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. పంజాబ్​లో పార్టీ చేపట్టిన ‘ఖేతీ బచావో యాత్ర’లో భాగంగా ఆయన చండీగఢ్​లో జరిగిన ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అప్పట్లో తన నానమ్మను కాపాడింది సిక్కులేనని, వారికి రుణపడి ఉంటానని చెప్పారు. పంజాబీలు తన మాటలను కాకుండా, తన చేతలనే చూస్తారని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందని, రైతులు కార్పొరేట్​శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సి వస్తుందని రాహుల్​ మండిపడ్డారు. అగ్రి బిల్లులను ప్రవేశ పెట్టినపుడు పార్లమెంట్​కు ఎందుకు హాజరుకాలేదన్న విమర్శలపైనా రాహుల్​ స్పందించారు. తాను ఎంపీ మాత్రమే కాదు.. ఓ కొడుకును కూడా అని చెప్పారు. తన తల్లికి వైద్యం చేయించడంకోసం అమెరికా తీసుకెళ్లాల్సి వచ్చిందని వివరించారు.

బార్డర్​లో అడ్డుకున్న హర్యానా పోలీసులు

ఖేతీ బచావో యాత్రలో భాగంగా ట్రాక్టర్ ర్యాలీగా వస్తున్న రాహుల్​ను హర్యానా పోలీసులు బార్డర్​లో అడ్డుకున్నరు. దీంతో కాసేపు టెన్షన్​ నెలకొంది. ఎంతసేపైనా సరే తాను ఇక్కడే వెయిట్​ చేస్తానని రాహుల్​ గాంధీ ప్రకటించారు.  కరోనా కారణంగా వంద మందికే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో రాహుల్​ అంగీకరించారు. దీంతో 3 ట్రాక్టర్లు ముందుకు వెళ్లగా.. మిగతా నేతలు వాపస్​ వెళ్లారు.