
"నా పేరు సావర్కర్ కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది" అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎంపీగా అనర్హత వేటు పడిన మరుసటి రోజున ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. లండన్‌లో చేసిన ప్రసంగానికి బీజేపీ డిమాండ్ చేసినట్లుగా ఎందుకు క్షమాపణలు చెప్పడం లేదని రాహుల్ ను ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన రాహుల్...తన పేరు సావర్కర్ కాదని, తాను గాంధీనని. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఆదానీపై తన ప్రసంగాన్ని చూసి మోడీ భయపడ్డారని, ఆయన కళ్లలో భయం స్పష్టంగా కనిపించిందని, అందుకే నన్ను పార్లమెంట్‌లో మాట్లాడనివ్వకూడదని అనుకున్నారు అని రాహుల్ చెప్పుకొచ్చారు. ఆదానీపై తాను ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం తనపై అనర్హత వేటు వేసిందని రాహుల్ ఆరోపించారు. ఇలాంటి అనర్హతల వంటివి తనను ఏమీ చేయలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టినా.. మోడీకి ప్రశ్నలు వేస్తూనే ఉంటానని రాహుల్ అన్నారు.
ఈ దేశం నాకు ప్రేమ, ఆప్యాయత అన్నీ ఇచ్చింది. అందుకే ఈ దేశ ప్రజల కోసం నేనేమైనా చేయడానికి వెనుకాడను. నిజం మాట్లాడటం తప్ప నాకు మరో మార్గం లేదు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసేదే లేదు. రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటు పడిన తర్వాత దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు రాహుల్ గాంధీ చుట్టూ చేరి, బీజేపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.