న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పీఠంపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఆ పదవి కోసం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రేసులో ఉన్నారు. ఆయననే సీఎం నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న క్రమంలో మరో సీనియర్ నేత వీడీ సతీశన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తనకు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి, లేకపోతే ఏమీ వద్దని స్పష్టం చేశారు.
సీఎం పదవి తప్ప మరే ఇతర పదవిని అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా సీఎం పదవిపై సస్పెన్స్ వీడడం లేదు. సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది.
పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాగే, సీఎం పదవిని ఆశిస్తున్న రమేశ్ చెన్నితలను అసెంబ్లీ స్పీకర్ గా నియమించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లతో రాహుల్ గాంధీ మంగళవారం భేటీ కానున్నారు.
