
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని మెట్లు దిగటానికి అయినా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కన్నతల్లి లాంటి పార్టీని వీడి వెళ్లినవారు.. తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు రేవంత్. పార్టీ నుంచి వెళ్లిన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు ఇతర నేతలు అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారాయన.
కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరగాలని.. ఇందుకోసం పీసీసీ చీఫ్ గా తనను ఎవరేమన్నా భరిస్తానని రేవంత్ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని మరో మారు రుజువైందన్నారు. 2023, మే 18వ తేదీ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్నాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడాన్ని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. మొన్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మాట్లాడిన మాటలే నిన్న కేసీఆర్ నోటి నుంచి వచ్చాయన్నారు. కేసీఆర్.. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో కర్నాటక లో కాంగ్రెస్ విజయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనడాన్ని రేవంత్ తప్పు పట్టారు.
బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ పోరాటం నిజమే అయితే కాంగ్రెస్ విజయాన్ని అభినందించేవారని చెప్పారు. కర్నాటలో జేడీఎస్ కు లక్షల కోట్ల రూపాయలు పంపి కాంగ్రెస్ ను ఓడించాలని కేసీఆర్ కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. హంగ్ ఏర్పడితే తానే కింగ్ మేకర్ అవుదామనుకొన్న కేసీఆర్.. బొక్క బోర్లా పడ్డారని విమర్శించారు. కర్నాటక ఫలితాల తర్వాత దేశంలో మోడీ బ్రాండ్ కు గ్రాఫ్ పడిపోయిందని రుజువైందన్నారు.
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ల మీద పనిచేసిందని, ఇక్కడ కేసీఆర్ సర్కారు 30శాతం కమీషన్ల కోసం పనిచేస్తున్నదన్నారు. ప్రతిపక్షాలను చీల్చడం, కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వడం ద్వారా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారన్నారు. కర్నాటకలో ఓటమిని బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల ఓటమిగా చూడాలని పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.