బీహార్ ఎన్నికల్లో పోటీ చేయట్లే.. ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం

బీహార్ ఎన్నికల్లో పోటీ చేయట్లే.. ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం

పాట్నా: మరో 20 రోజులు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల్లో పోటీపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్ని్కల్లో పోటీ చేయనని పీకే సంచలన ప్రకటన చేశారు. కేవలం పార్టీ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. పార్టీలో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన విషయం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 2024, అక్టోబర్ 2 జన్ సూరజ్ పార్టీ స్థాపించారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ. 

అయితే.. ప్రశాంత్ కిశోర్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే దానిపై గత కొద్ది రోజులు వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కంచుకోటైనా రాఘోపూర్ స్థానం నుంచి ప్రశాంత్ కిశోర్ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీపై పీకే అనూహ్య ప్రకటన చేశారు. అసలు తాను ఎన్నికల్లో పోటీనే చేయడం లేదని బాంబ్ పేల్చారు. కేవలం పార్టీ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిశోర్ యూటర్న్ తీసుకోవడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.