రాజకీయాల నుంచి రిటైర్​మెంట్ తీసుకోలేదు: వెంకయ్య నాయుడు

రాజకీయాల నుంచి రిటైర్​మెంట్ తీసుకోలేదు: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, వెలుగు: ఇకపై రాజకీయ, సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రోజువారి రాజకీయ పరిణామాలు, మాతృభాష వంటి అంశాల్లో ప్రజల్ని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఢిల్లీలోని త్యాగ్ రాజ్ మార్గ్ లో అధికారికంగా కేటాయించిన నివాసానికి మంగళవారం ఢిల్లీలోని తెలుగు జర్నలిస్ట్ లను ఆహ్వానించారు. తన అధికారిక నివాసాన్ని జర్నలిస్ట్ లకు తిప్పి చూపించారు. తర్వాత ప్రస్తుత రాజకీయాలు, దేశం ముందున్న సవాళ్లు తదితర అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరం అయ్యాను కానీ, పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ తీసుకోలేదన్నారు. ఇకపై ఇంటర్వ్యూలు, ఇష్టాగోష్టి, సమావేశాలు చేపడతానని చెప్పారు. ఢిల్లీ వేదికగా మార్చి 21, 22, 23 వ తేదీల్లో ఉగాది సమ్మేళనం నిర్వహిస్తానని తెలిపారు. ఈ సమ్మేళనానికి వివిధ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తాన్నారు.

నేతలు కాన్​స్టాంట్​గా ఉంటలేరు

తెలంగాణలోఎమ్మెల్యేల కొనుగోలు, పార్టీ ఫిరాయింపుల వంటి అంశాలు రాజకీయాల్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాయని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరమన్నారు. గతంలో సిద్ధాంతాలను నమ్ముకొని ప్రజా ప్రతినిధులు చివరి శ్వాస వరకు అదే పార్టీలో కొనసాగే వారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లి వచ్చే లోపే పార్టీలు మారుతున్నారని అన్నారు. రాజకీయ నాయకులు ‘కాన్ స్టాంట్ గా లేకుండా ఇన్ స్టాంట్’ గా మారారన్నారు. చట్టసభల్లో, బయట ప్రజా ప్రతినిధులు వాడుతున్న భాషను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. చట్ట సభలు, న్యాయస్థానాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో తల్లి భాష వినియోగం పెంచినప్పుడు భాషను కాపాడుకోగలమని చెప్పారు. 2013లో గోవాలో జరిగిన పార్టీ మీటింగ్ లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా మోడీని తానే ప్రతిపాదించానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా నమ్మి, ప్రజల్లో వెళ్లే నేత మోడీ అని విశ్వసించానని చెప్పారు.