మీడియా మిత్రులారా.. జర పైలం

మీడియా మిత్రులారా.. జర పైలం
  • రిపోర్టింగ్​లో జాగ్రత్తలు పాటించాలె
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం సూచనలు

న్యూఢిల్లీ: మీడియాలో పనిచేస్తున్నవారికి కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం పలు సూచనలు చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జాగ్రత్తలు చెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని వార్తాపత్రికలు, మీడియా సంస్థలకు సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనావైరస్ సంబంధిత వార్తలను కవర్ చేస్తున్న విలేకర్లు, కెమెరామెన్​లు, ఫొటోగ్రాఫర్లు తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. సబ్ ఎడిటర్లు, కార్యాలయ సిబ్బంది నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని మీడియా సంస్థలను కోరింది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా పర్సన్స్ కు ఈ మధ్యే కరోనా వచ్చినట్లు మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందని గుర్తుచేసింది. ‘‘రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు దేశంలోని కరోనా రెడ్ జోన్లలో, మిగతా ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సివస్తుంది. వారంతా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మీడియా ఆఫీసుల్లో పనిచేసే సబ్ ఎడిటర్లు, సిబ్బంది పట్ల కూడా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి”అని లేఖలో పేర్కొంది. ఇప్పటికే చెన్నైలోని ఓ తమిళ న్యూస్ టీవీలో పనిచేస్తున్న 27 మందికి, ముంబైలో 53 మంది జర్నలిస్టులకు వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఢిల్లీ ప్రభుత్వాలు మీడియాలో పనిచేస్తున్న వారికి కరోనా టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించిన మరుసటి రోజు కేంద్ర సమాచార శాఖ ఈ సూచనలిచ్చింది.