హైదరాబాద్: ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు బుధవారం మరోసారి కోర్టులో హాజరు పరిచారు. మరో కేసులో ఇమంది రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పిటి వారెంట్ వేశారు. రెండో కేసులో ఇమంది రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇమంది రవిపై మొత్తం ఐదు కేసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు.
తాజాగా మరో కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. మిగిలిన మూడు కేసులపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారంట్ వేశారు. కోర్టు అనుమతితో.. మూడు కేసుల్లో కూడా ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయనున్నారు. మరోవైపు కస్టడీ ఇవ్వాలంటూ వేసిన పోలీసుల పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. పోలీస్ కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.
ఐ బొమ్మలో సినిమాలు చూసిన వారందరి డేటా ఇమ్మడి రవి వద్ద ఉందని ఏసీపీ శ్రీనివాసులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల కస్టడీలో ఆయన నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్టు ఆయన చెప్పారు. ఐబొమ్మ వెబ్ సైట్కు వెళ్లగానే కండీషయన్ అగ్రీ చేయాలనే ఆప్షన్ ఉంటుందని, దానికి టిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న మొత్తం సమాచారం రవికి వెళ్లిపోతుందని అన్నారు. అందులో వ్యూయర్ షిప్ను చూపించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేశాడని తెలిపారు.
ఐబొమ్మలో ఏదైనా సినిమా చూసేందుకు ప్రయత్నిస్తే ముందుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వస్తుందని వివరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా సినిమాలు కొనుగోలు చేసుకొనే వాడని వివరించారు. రవిని ఆయన భార్య పట్టించిందనడంలో నిజం లేదని ఏసీపీ చెప్పారు.
