పాక్‌తో ఇండియాఫస్ట్‌ ఫైట్‌

పాక్‌తో ఇండియాఫస్ట్‌ ఫైట్‌
  •  అక్టోబర్‌‌ 24న ఇండో-పాక్‌‌ టీ20 ధమాకా
  •  టీ20 వరల్డ్‌‌ కప్‌‌ ఫుల్‌‌ షెడ్యూల్‌‌ రిలీజ్‌‌ చేసిన ఐసీసీ
  •  నవంబర్‌‌ 14న మెగా ఫైనల్‌‌

దుబాయ్‌‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్‌‌ మధ్య టీ20 పోరుకు ముహూర్తం ఖరారైంది. 2016  టీ20 వరల్డ్‌‌కప్‌‌లో చివరిగా షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో పోటీపడిన ఇరు జట్లు మరోసారి అమీతుమీకి రెడీ అవుతున్నాయి. టీ20 వరల్డ్‌‌కప్‌‌లో భాగంగా అక్టోబర్‌‌ 24న దుబాయ్‌‌ వేదికగా జరిగే మ్యాచ్‌‌లో ఢీ కొట్టనున్నాయి. కరోనా దెబ్బకు యూఏఈకి తరలించిన మెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌ పూర్తి షెడ్యూల్‌‌ను ఐసీసీ మంగళవారం రిలీజ్‌‌ చేసింది. దీని ప్రకారం పాక్‌‌తో జరిగే పోరుతో టీమిండియా తన వరల్డ్‌‌కప్‌‌ వేటను మొదలుపెట్టనుంది.  అనంతరం న్యూజిలాండ్‌‌(అక్టోబర్‌‌ 31), అఫ్గానిస్తాన్‌‌(నవంబర్‌‌ 3)తో వరుసగా మ్యాచ్‌‌లు ఆడుతుంది. ఆ తర్వాత నవంబర్‌‌ 5, 8 తేదీల్లో జరిగే మ్యాచ్‌‌ల్లో క్వాలిఫయర్‌‌ రౌండ్‌‌ విజేతలతో టీమిండియా తలపడనుంది. 
అక్టోబర్‌‌ 17న షురూ.. 
అక్టోబర్‌‌ 17న మొదలయ్యే టీ20 వరల్డ్‌‌కప్‌‌ నవంబర్‌‌ 14న జరిగే మెగా ఫైనల్‌‌తో ముగుస్తుంది. ఒమన్‌‌, యూఏఈ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్‌‌ను బీసీసీఐ హోస్ట్‌‌ చేస్తుంది. మొత్తం టోర్నీ రెండు భాగాలుగా జరగనుంది. తొలుత ఎనిమిది క్వాలిఫయర్‌‌ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్‌‌–1 పోటీల్లో తలపడతాయి. రెండు గ్రూపుల్లో టాప్‌‌–2లో నిలిచిన జట్లు సూపర్‌‌–12కు అర్హత సాధిస్తాయి. డైరెక్ట్‌‌ ఎంట్రీ దక్కించుకున్న టాప్‌‌–8 టీమ్స్‌‌తో కలిసి ఈ రౌండ్‌‌లో అవి తలపడతాయి. నాలుగు క్వాలిఫయర్‌‌ జట్లతో కలిసి మొత్తం 12 జట్లు రెండు గ్రూపులుగా డివైడ్‌‌ అయ్యి సూపర్‌‌–12లో పోటీపడతాయి.  అక్టోబర్‌‌ 23న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌‌తో ఈ రౌండ్‌‌ (సూపర్‌‌12) మొదలవుతుంది. నవంబర్‌‌ 8న జరిగే మ్యాచ్‌‌తో సూపర్‌‌12 రౌండ్‌‌ ముగుస్తుంది. ఈ రౌండ్‌‌లో రెండు గ్రూపుల నుంచి టాప్‌‌–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్‌‌ 10, 11 తేదీల్లో వరుసగా రెండు సెమీఫైనల్‌‌ మ్యాచ్‌‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌‌లు అబుదాబి,  దుబాయ్‌‌లో జరగనున్నాయి.  సెమీస్‌‌లో గెలిచిన రెండు జట్లు దుబాయ్‌‌ వేదికగా 14న జరిగే టైటిల్‌‌ ఫైట్‌‌లో తలపడతాయి. సెమీఫైనల్స్​తో పాటు ఫైనల్​ మ్యాచ్​కు రిజర్వ్​ డే కేటాయించారు. నవంబర్​ 15వ తేదీ ఫైనల్​కు రిజర్వ్​ డే.  కాగా, రౌండ్‌‌–1మ్యాచ్‌‌లు ఒమన్‌‌, అబుదాబి, షార్జాలో జరుగుతాయి.  ఇక, సూపర్‌‌–12  మ్యాచ్‌‌లు దుబాయ్‌‌,  అబుదాబి, షార్జాలో షెడ్యూల్‌‌ చేశారు. 
ఇండియా షెడ్యూల్‌‌
తేదీ    ప్రత్యర్థి     వేదిక
అక్టోబర్‌‌ 24    పాకిస్తాన్‌‌    దుబాయ్‌‌
అక్టోబర్‌‌ 31    న్యూజిలాండ్‌‌    దుబాయ్‌‌
నవంబర్‌‌ 3    అఫ్గానిస్తాన్‌‌    అబుదాబి
నవంబర్‌‌ 5    బి1    దుబాయ్‌‌
నవంబర్‌‌ 8    ఏ2    దుబాయ్‌‌
(అన్ని  మ్యాచ్‌‌లు రా. 7.30 నుంచి)