నేడు సౌతాఫ్రికాతో ఇండియా మ్యాచ్

నేడు సౌతాఫ్రికాతో ఇండియా మ్యాచ్

ఆశల సౌధంలో విహరిస్తున్న కుర్రాళ్లు.. కలల కప్‌‌ కోసం వేస్తున్న తొలి అడుగు ఇది.. అత్యుత్తమ బ్యాట్స్‌‌మన్‌‌ నుంచి లెజెండ్‌‌ స్థాయిని అందుకోవడానికి విరాట్‌‌ వేస్తున్న తొలి అడుగు ఇది.. శతకోటి జనవాహిని కోరికను తీర్చేందుకు టీమిండియా వేస్తున్న తొలి అడుగు ఇది.. ముచ్చటగా మూడో కప్‌‌ కోసం ఎదురుచూస్తున్న భారతావని కల ఫలించేందుకు వేస్తున్న తొలి అడుగు ఇది.. ఎదురెళ్లి యుద్ధం చేయాలన్నా.. ప్రత్యర్థులను పడగొట్టి ముందుకెళ్లాలన్నా.. అస్త్రశస్త్రాలను సరిచూసుకునేందుకు వేస్తున్న తొలి అడుగు ఇది..! ఘన వారసత్వానికి గుర్తుగా.. ఘనత వహించిన ఆటగాళ్లను గుర్తు చేసుకుంటూ.. ఘనమైన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుంటూ.. నేడు సౌతాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌‌తో విరాట్‌‌సేన.. వరల్డ్‌‌కప్‌‌ సంగ్రామాన్ని మొదలుపెట్టబోతున్నది.

సౌతాంప్టన్‌‌: సంచలనాలతో సాగిపోతున్న వరల్డ్‌‌కప్‌‌లో మరో రసవత్తర పోరాటానికి సమయం ఆసన్నమైంది. భారీ ఆశలు, అంతకుమించిన అంచనాలతో బరిలోకి దిగుతున్న ఇండియా జట్టు.. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌‌లో బలమైన సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. రికార్డులు, ఫామ్‌‌ పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్‌‌లో టీమిండియానే ఫేవరెట్‌‌. అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో సమతూకంగా కనిపిస్తున్న విరాట్‌‌సేన.. తొలి మ్యాచ్‌‌తోనే టోర్నీపైనే స్పష్టమైన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా బలమైన తుది జట్టుతో బరిలోకి దిగాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 1999 వరల్డ్​కప్​ తొలి మ్యాచ్‌‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడినదానికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా చూస్తున్నది. మరోవైపు రెండు వరుస పరాజయాలతో ఢీలా పడిన సఫారీలు.. ఈ మ్యాచ్‌‌తోనైనా గాడిలో పడాలని భావిస్తున్నారు. పేపరు మీద బలంగా కనిపిస్తున్న ప్రొటీస్‌‌.. మైదానంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చూపెట్టలేకపోతున్నది. లీగ్‌‌ దశలో ఆడే 9 మ్యాచ్‌‌ల్లో కనీసం 6 మ్యాచ్‌‌ల్లో నెగ్గితే నాకౌట్‌‌ బెర్త్‌‌ ఖాయమవుతుంది. సఫారీలు ఇప్పటికే రెండు ఓడారు. కాబట్టి ఈ మ్యాచ్‌‌ వాళ్లకు చావోరేవో పరిస్థితి. అలాగని తేలికగా తీసుకుంటే ఇండియా కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే తొలి 5 మ్యాచ్‌‌ల్లో టీమిండియాకు బలమైన ప్రత్యర్థులే ఎదురుకానున్నారు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌‌లో ఓడినా పరిస్థితి చేజారే ప్రమాదం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తొలి అడుగు ఘనంగా వేయాలని అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

త్రయం చెలరేగితే..

ఇటీవల కాలంలో ఇండియా విజయాల్లో అతి ముఖ్యమైన పాత్ర టాప్‌‌–3 బ్యాట్స్‌‌మెన్‌‌దే. ముందుగా రోహిత్‌‌, ధవన్‌‌ వీలైనంతగా దంచేయడం.. ఆ తర్వాత కోహ్లీ భారీ స్కోరుగా మల్చడం ఆనవాయితీగా వస్తున్నది. టీమిండియాకు డ్రైవింగ్‌‌ఫోర్స్‌‌గా నిలిచే ఈ త్రయం మెగా ఈవెంట్‌‌లోనూ చెలరేగితే.. ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. అయితే సౌతాఫ్రికాపై రోహిత్‌‌ సగటు 28.0గా ఉండటం కలవరపెడుతున్నా..  ధవన్‌‌ (52.67), కోహ్లీ (66.79)కి మాత్రం తిరుగులేదు. ఇప్పటివరకు సఫారీ టీమ్‌‌పై 26 వన్డేలు ఆడిన విరాట్‌‌.. 1269 రన్స్‌‌ చేశాడు. చివరి 10 మ్యాచ్‌‌ల్లో 142.67 సగటుతో 856 పరుగులు చేశాడంటే అతని ఫామ్‌‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 4 సెంచరీలు చేశాడు. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు కుదురుకున్నా.. సౌతాంప్టన్‌‌లో పరుగుల వరద పారినట్లే. అయితే ఈ ముగ్గురికీ రబాడ నుంచి ముప్పు పొంచి ఉందన్నది వాస్తవం.  టీమిండియా లైనప్‌‌లో అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో కేఎల్‌‌ రాహుల్‌‌ ఆడే చాన్స్‌‌ ఉంది. ఇదే జరిగితే ఆల్‌‌రౌండర్‌‌ విజయ్‌‌ శంకర్‌‌కు అవకాశం లేనట్లే. వామప్‌‌ మ్యాచ్‌‌లో సెంచరీ చేయడం రాహుల్‌‌కు కలిసొచ్చింది. ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లు ఆడకపోయినా కేదార్‌‌ జాదవ్‌‌కు లైన్‌‌ క్లియర్‌‌ అయినట్లే.  ఐదో స్థానంలో ధోనీ, తర్వాత కేదార్‌‌ వచ్చే అవకాశాలున్నాయి. ఫినిషింగ్‌‌ బాధ్యత ఈ ఇద్దరిదే.

ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు

పచ్చికతో కూడిన వికెట్‌‌ కావడంతో ఇండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో ఆడే అవకాశం ఉంది. పేస్‌‌ బౌలింగ్‌‌లో బుమ్రాకు తోడుగా భువనేశ్వర్‌‌, షమీలలో ఒకరికే అవకాశం దక్కొచ్చు. స్ట్రయిక్‌‌ వికెట్లు తీయడంలో సిద్ధహస్తుడు కావడంతో భువీకి చాన్స్‌‌ ఇస్తున్నట్లు సమాచారం. అయితే మ్యాచ్‌‌కు ముందు ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి షమీపై కూడా ఓ నిర్ణయానికి రానున్నారు. మ్యాచ్‌‌ మధ్యలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో.. కుల్దీప్‌‌, చహల్‌‌కు తుది జట్టులో చోటు ఖాయం. వీళ్ల మణికట్టు మాయాజాలాన్ని ప్రొటీస్ బ్యాట్స్‌‌మెన్‌‌ ఎంతమేరకు అడ్డుకుంటారో చూడాలి. సౌతాఫ్రికాపై చెరో 6 మ్యాచ్‌‌లు ఆడిన చహల్‌‌, కుల్దీప్‌‌ వరుసగా 16, 17 వికెట్లు తీశారు. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు సక్సెస్‌‌ అయితే టీమిండియా విజయం నల్లేరు మీద నడకే. ఆల్‌‌రౌండర్‌‌గా హార్దిక్‌‌కు ఢోకా లేదు. కాబట్టి రవీంద్ర జడేజా రిజర్వ్‌‌ బెంచ్‌‌కే పరిమితం. ఐదో బౌలర్‌‌ కోటాను హార్దిక్‌‌, జాదవ్‌‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ రకంగా చూసినా సౌతాంప్టన్‌‌ పరిస్థితులు టీమిండియాకే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్‌‌లో విరాట్‌‌సేన ఫేవరెట్‌‌గా దిగుతున్నది.

స్టెయిన్‌‌ ఔట్‌‌..

సౌతాఫ్రికాను గాయాల బెడద పీడిస్తున్నది. ఎంగిడి ఈ మ్యాచ్​కు దూరమవగా..  భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్పీడ్‌‌స్టర్ డేల్ స్టెయిన్ టోర్నీ నుంచి వైదొలిగాడు. కుర్ర పేసర్‌‌ నోర్ట్‌‌జీని టీమిండియాపై ప్రధాన అస్త్రంగా ప్రయోగిద్దామని భావించినా.. అతను కూడా గాయంతో బాధపడుతున్నాడు. మొత్తానికి ఈ ముగ్గురు పేసర్ల గైర్హాజరీతో సఫారీ బౌలింగ్‌‌ దిక్కుతోచని స్థితిలో పడిపోంది. దీనికితోడు ఆడిన రెండు మ్యాచ్‌‌ల్లో ఓడటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని ఘోరంగా దెబ్బతీసింది. ఈ రెండు మ్యాచ్‌‌ల్లో  పేసర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రెండు మ్యాచ్‌‌ల్లోనూ 300లకు పైగా స్కోర్లు ఇచ్చుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. జట్టులో ఉన్న ఏకైక స్పిన్నర్‌‌ ఇమ్రాన్‌‌ తాహిర్‌‌ (4/118) ఫర్వాలేదనిపించాడు. కానీ స్పిన్‌‌ను సమర్థంగా ఆడే టీమిండియాపై అతను ప్రభావం చూపుతాడా? 11 నుంచి 40 ఓవర్ల మధ్య అతనికి తోడు నిలిచే ఇతర బౌలర్లు లేకపోవడం కూడా ప్రతికూలాంశంగా మారింది. అయితే పేసర్ల ప్లేస్​లో ఆల్‌‌రౌండర్లను బరిలోకి దించుతామని కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌ అంటున్నా.. ఇది ఎంతవరకు వర్కౌట్‌‌ అవుతుందో చూడాలి.

తుది కూర్పు ఎలా?

రెండు మ్యాచ్‌‌ల్లో బ్యాటింగ్‌‌ వైఫల్యం నేపథ్యంలో సౌతాఫ్రికా తుది జట్టు  కూర్పుపై ఆసక్తి నెలకొంది. డివిలియర్స్‌‌ గైర్హాజరీతో డుప్లెసిస్‌‌పై బ్యాటింగ్ భారం పడింది. కానీ ఆ ఒత్తిడిని అతను అధిగమించలేకపోతున్నాడు. డికాక్‌‌, మార్​క్రమ్​ కీలకమే అయినా.. రెండు మ్యాచ్‌‌ల్లోనూ విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌‌లో గాయపడిన ఆమ్లా కోలుకున్నా.. మునుపటి స్థాయిలో ఆడతాడా? చూడాలి. మిడిలార్డర్‌‌ భారాన్ని మోస్తున్న డుసేన్‌‌కు డుమిని, మిల్లర్‌‌ నుంచి సహకారం అందడం లేదు.  లోయర్‌‌ ఆర్డర్‌‌లో హిట్టింగ్‌‌ చేసే వాళ్లు లేరు. అనేక సమస్యల మధ్య ముచ్చటగా మూడో మ్యాచ్‌‌ ఆడుతున్న సఫారీలు.. ఇండియాను నిలువరిస్తారా..?

గుణపాఠం నేర్చుకున్నాం.మళ్లీ తప్పులు చేయం

బాగా ఆడినా ఆడకపోయినా మనపై అంచనాలు కచ్చితంగా ఉంటాయి. వాటికి అనుగుణంగా ఆడాల్సిందే.చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ నుంచి మేం గుణపాఠం నేర్చుకున్నాం. అలాంటి తప్పులు మరోసారి చేయబోం. ఈవారం రోజులు మ్యాచ్‌లు చూడటం ద్వారా ఇక్కడ పిచ్‌లను, వాతావరణాన్ని అవగాహన చేసుకున్నాం.గతేడాదితో పోలిస్తే జట్టు లో చాలా మార్పులు వచ్చా యి.మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌, చహల్‌ రాకతో బౌలింగ్‌బలోపేతమైంది. మిడిల్‌  ఓవర్లలో వీళ్లు వికెట్లు తీస్తే పేసర్లపని సులువు అవుతుంది. వాతావరణాన్ని బట్టి మూడోసీమర్‌పై నిర్ణయం తీసుకుంటాం . మేఘావృతమైతే తొలి10 ఓవర్లు చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో మూడోసీమర్‌ చాలా అవసరం. కేదార్‌ పూర్తి ఫిట్ స్‌సాధించా డు. తుది జట్టు లో రేసులో ఉన్నాడు. జాదవ్‌రాకతో మా ప్రత్యామ్నాయాలు కూడా పెరిగాయి. రబాడఏమన్నాడో నాకు తెలియదు. కానీ నాణ్యమై న పేసర్‌గాఅతన్ని గౌరవిస్తా.- కోహ్లీ (ఇండియా కెప్టెన్‌)