నూతన చిత్రానికి 'ఇడుపు కాయితం' అనే టైటిల్ ప్రకటించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పేరును సామాజిక మాధ్యమాల్లో కొందరు వెటకారం చేయడం, దీనిని ‘తెలుగులోకి డబ్ చేస్తారా’ అంటూ అవహేళన చేయడం కేవలం ఒక సినిమా శీర్షికపై జరిగిన దాడి కాదు. ఇది శతాబ్దాలుగా తెలంగాణ భాష, అస్తిత్వంపై జరుగుతున్న నిరంతర సాంస్కృతిక అణచివేతకు స్పష్టమైన నిదర్శనం. తెలంగాణ మాండలికంలో 'ఇడుపు కాయితం' అంటే విడాకుల పత్రం అని అర్థం. పూర్వకాలంలో కోర్టుల చుట్టూ తిరిగే వీలు లేనప్పుడు, భార్యాభర్తలు కలిసి జీవించలేమని నిర్ణయించుకుంటే గ్రామంలోని పెద్దల సమక్షంలో ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకుని విడిపోయేవారు. ఆ పత్రాన్నే 'ఇడుపు కాయితం' లేదా 'ఇడుసు కాయితం' అని పిలుస్తారు.
ఇడుపు' లేదా 'ఇడుసు' అంటే వదిలిపెట్టడం అని అర్థం. ఈ పదం ప్రధానంగా తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో ఎక్కువగా వాడుకలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దల సమక్షంలో విడిపోయేటప్పుడు రాసుకునే ఈ సాంప్రదాయక పదం వెనుక ఒక సుదీర్ఘమైన చరిత్ర, సామాజిక జీవన విధానం దాగి ఉన్నాయి. ప్రతి భాషకు, ప్రతి ప్రాంతానికి కొన్ని సొంత పదబంధాలు ఉంటాయి. వాటిని గౌరవించడం కనీస సంస్కారం. ఒక ప్రాంతానికి చెందిన సహజమైన పదాన్ని చూసి, అది అసలు తెలుగేనా అని ప్రశ్నించడం అహంకారానికి పరాకాష్ఠ. కోస్తాంధ్ర యాసను మాత్రమే అసలైన తెలుగుగా భావించే సంకుచిత ఆలోచనా విధానం నుంచి ఇంకా కొందరు బయటకు రాకపోవడం విచారకరం.
సాంస్కృతిక స్వీయగౌరవం
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రధాన స్రవంతి సినిమాలలో తెలంగాణ యాసకు దక్కిన స్థానం అత్యంత అవమానకరంగా ఉండేది. కథానాయకుడు, అతని కుటుంబం ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన కోస్తాంధ్ర ప్రామాణిక భాషను మాట్లాడేవారు. అదే సమయంలో విలన్లు, హాస్యనటులు, అమాయకులు లేదా సమాజంలో వెనుకబడిన పాత్రల చేత తెలంగాణ యాసను మాట్లాడించేవారు. ఈ విధమైన చిత్రణ ద్వారా ఒక యాస మాట్లాడేవారు మాత్రమే సంస్కారవంతులని, మరొక యాస మాట్లాడేవారు తక్కువవారనే అలిఖిత భావనను ప్రేక్షకుల మనసుల్లో బలంగా నాటారు. ఇక్కడి సంస్కృతిని, పండుగలను, జీవన విధానాన్ని తెరపై చూపించడానికి దర్శకులు
వెనకాడేవారు. కథానాయకుడు మాట్లాడే భాష మాత్రమే గొప్పదనే అలిఖిత నిబంధనను సృష్టించారు. ఆ వివక్షను భరిస్తూనే, సుదీర్ఘ పోరాటాల ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. ఈ రాజకీయ విజయంతోపాటు సాంస్కృతిక స్వీయ గౌరవం కూడా పెరిగింది. 'బలగం' వంటి చిత్రాలు తెలంగాణ మట్టి కథల సత్తాను, ఇక్కడి భావోద్వేగాలను ప్రపంచానికి చాటిచెప్పాయి. అటువంటి విజయాల తర్వాత కూడా, ఒక స్థానిక పదంపై ఇంతటి వ్యతిరేకత రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలుగు ప్రజల మధ్య భాషాపరమైన బంధం
భాష అనేది కేవలం సంభాషణల మాధ్యమం కాదు. అది ఒక జాతి సంస్కృతికి, జీవనానికి అద్దం పడుతుంది. తెలంగాణ భాషలో అమాయకత్వం, ఆత్మీయత, శ్రమజీవుల వేదన ఉంటాయి. ఈ భాషను తక్కువ చేసి మాట్లాడటం అంటే ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని అవమానించడమే అవుతుంది. కొందరు నెటిజన్లు ఈ సినిమాకు సబ్ టైటిల్స్ కావాలంటూ చేసిన కామెంట్లు వారి అజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. ఇతర భాషా చిత్రాలను, పరాయి సంస్కృతులను గుడ్డిగా ఆదరించే వీరు, పక్కనే ఉన్న తోటి తెలుగు సోదరుల యాసను అర్థం చేసుకోలేమనడం ద్వేషమే. ఈ వివాదంపై నిర్మాత తీసుకున్న నిర్ణయం అభినందనీయం. కథకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకే ఈ టైటిల్ పెట్టామని, పేరు మార్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. వ్యాపార సమీకరణాల కోసం స్థానికతను బలిపెట్టకుండా, ఈ చిత్ర బృందం చూపిన ధైర్యం ప్రశంసనీయం. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల మధ్య భాషాపరమైన బంధం కొనసాగుతోంది.
అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు
తెలంగాణ సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడు తన కథలను తానే చెప్పుకునే స్థాయికి చేరింది. ఈ ప్రయాణాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ చిత్రపటంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తెలంగాణ యాస కేవలం హాస్యానికి మాత్రమే కాదు, ఒక కథానాయకుడి పౌరుషానికి, భావోద్వేగాలకు, ప్రేమకు కూడా అద్భుతమైన మాధ్యమంగా మారుతుందని సరికొత్త దర్శకులు నిరూపించారు. 'అర్జున్ రెడ్డి', 'ఫిదా', 'ఇస్మార్ట్ శంకర్', 'దసరా' వంటి చిత్రాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించడమే కాకుండా, తెలంగాణ యాసకు ఉన్న మాస్ పవర్‌ను బాక్సాఫీస్ వద్ద రుజువు చేశాయి. అయితే, కేవలం వ్యాపార కోణంలో యాసను వాడుకోవడం వేరు, ఇక్కడి మట్టి కథలను సహజత్వంతో తెరకెక్కించడం వేరు. 'బలగం' వంటి చిత్రం ఈ తేడాను స్పష్టంగా చూపించింది. తెలంగాణ పల్లెల్లో ఉండే చావు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలను ఏమాత్రం కల్తీ లేకుండా చూపించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.
భిన్నత్వాన్ని గౌరవించడమే నిజమైన సంస్కృతి
గ్లోబల్ సినిమా అంటూ ప్రపంచ దేశాల కథలను ఆదరిస్తున్నామని చెప్పుకునే ఆడియన్స్, పక్కనే ఉన్న తోటి ప్రాంతపు భాషా వైవిధ్యాన్ని అంగీకరించలేకపోవడం పెద్ద వైరుధ్యం. ప్రతి ప్రాంతానికి ఒక భాషా సౌందర్యం ఉంటుంది. తెలంగాణ మాండలికంలో శ్రమజీవుల నిసర్గ స్వభావం, పల్లె ప్రజల ఆత్మీయత దాగి ఉంటాయి. ఒక పదం అర్థం కానప్పుడు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కానీ, అది అసలు భాషే కాదు అన్నట్లు మాట్లాడటం అజ్ఞానం అనిపించుకుంటుంది. 'ఇడుపు కాయితం' వివాదం తెలుగు చిత్రసీమలో, సమాజంలో ఇంకా తొలగిపోని ప్రాంతీయ అసహనాన్ని గుర్తుచేసింది. భిన్నత్వాన్ని గౌరవించడమే నిజమైన సంస్కృతి. తెలంగాణ భాష, యాస, సంస్కృతి ఎవరి దయాభిక్షపై ఆధారపడి లేవు. భిన్న ప్రాంతాల ప్రతిభను సమానంగా ఆదరించినప్పుడే తెలుగు సినిమా గ్లోబల్ స్థాయి నుంచి యూనివర్సల్ స్థాయికి ఎదుగుతుంది.
- డా. కట్కూరి,
సైబర్ నిపుణుడు & పాలసీ విశ్లేషకుడు
