కాంగ్రెస్​కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి : డీకే అరుణ

కాంగ్రెస్​కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి : డీకే అరుణ

జడ్చర్ల టౌన్, వెలుగు : బీఆర్‌‌ఎస్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామన్న కాంగ్రెస్ మాటలకే పరిమితమైందని, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు అనుమతించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని కేఎల్ఎం ఫంక్షన్ హాల్​లో నారీ శక్తి వందన్​ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ లోక్​సభ ఎన్నికల గురించి కాంగ్రెస్​ పార్టీ భయపడుతోందని, ఎలక్షన్లలో ఎలాగైనా గెలవాలని అడ్డగోలు ఆరోపణలు చేస్తోందన్నారు. 

ప్రధాని మోదీ అధికారిక పర్యటనపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని పెద్దన్న అని పిలవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దీనిపై కొందరు లీడర్లు ఆరోపణలు చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యపడదని, ఆరోపణలు చేసేవాళ్లు ఈ విషయాన్ని గుర్తెరిగి మాట్లాడాలన్నారు.