సమస్యలు నిరూపిస్తే.. కేసీఆర్ దళితుడ్ని సీఎం చేయాలి

సమస్యలు నిరూపిస్తే.. కేసీఆర్ దళితుడ్ని సీఎం చేయాలి
  • సమస్యలు లేకపోతే నేను ముక్కు నేలకు రాసి ఇంటికెళ్లిపోతా
  • ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల సవాల్

రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో అభివృద్ధి చేశామని.. ఎలాంటి సమస్యలు లేవని గొప్పలు చెప్పుకుంటున్న కేటీఆర్, కేసీఆర్ లు....రాష్ట్రంలో ప్రజలకు సమస్యలున్నాయిని తాను నిరూపిస్తే కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి దళితుడ్ని సీఎం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒకవేళ ఎలాంటి  సమస్యలు లేకపోతే నేను ముక్కు రాసి ఇంటికి వెళ్ళి పోతానని.. దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ ను స్వీకరించాలన్నారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర  ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సాగింది. 
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే అన్నారు. కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు వస్తున్నా ఢిల్లీలోని బిజెపి పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరి కోసం మరొకరు పనిచేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో వైయస్సార్ కు మంచి పేరుంది.. వైయస్సార్ విశ్వసనీయత ఉంది.. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదన్నారు. కేంద్ర, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయంటే రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో మోడీ ఇద్దరే కారణమన్నారు. కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, అందుకే ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 
 వైఎస్ ఆర్ పార్టీ ఎలాంటి పొత్తులు  పెట్టుకోదు
వైఎస్ఆర్ పార్టీ సింహం లాగే సింగిల్ గా వస్తోందని, ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోవాలి, వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని,  వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను, రైతులను, నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తానని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని  మోసం చేశాడని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణలో నిరుద్యోగులు గొర్లు బర్లు మేపుతూ బతుకుతున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ లో తండ్రీ కొడుకుల ఫోటోలు వేసుకుంటే సరిపోదు.. వరద ముంపునకు గురైన వాళ్లకు ఇస్తామన్న పదివేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి.. ? రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికైనా ఆయన మేలు చేశాడా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో లిక్కర్ ప్రధాన ఆదాయ వనరుగా మారిందని, ప్రతి గల్లీలో బస్తీలో లిక్కర్ షాప్ లు కనిపిస్తాయన్నారు. రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినా, మహిళలపై దౌర్జన్యాలు, దాడులు జరిగినా తండ్రీ కొడుకులు పట్టించుకోవడం లేదన్నారు. నేను దీక్ష చేస్తే తండ్రి కొడుకులు నా మీద దాడి చేయించి నన్ను ఇబ్బందులు పెట్టారని, అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కరించలేక పోతున్నారని ఆమె నిలదీశారు.