ఎన్డీయే గెలిస్తే.. నితీశ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ గాయబ్‌‌‌‌ .. బీజేపీ అనుచరులకే సీఎం పదవిస్తరు: కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఖర్గే

ఎన్డీయే గెలిస్తే.. నితీశ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ గాయబ్‌‌‌‌ .. బీజేపీ అనుచరులకే సీఎం పదవిస్తరు: కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఖర్గే
  • మోదీ, నితీశ్‌‌‌‌కు కుర్చీమీదున్న ధ్యాస దళితులపై లేదని ఫైర్ 

హజీపూర్‌‌‌‌‌‌‌‌: బిహార్‌‌‌‌లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే.. నీతీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ను ముఖ్యమంత్రి కారని, బదులుగా కాషాయ పార్టీ అనుచరుడికి ఆ పదవి కట్టబెడతారని కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ మల్లికార్జున ఖర్గే అన్నారు. బిహార్‌‌‌‌‌‌‌‌లోని వైశాలి జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన తొలిసారి పాల్గొని మాట్లాడారు. 

జయప్రకాశ్‌‌‌‌ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ వంటి సామాజికవాదానికి ద్రోహం చేసి, మహిళా వ్యతిరేక బీజేపీతో నితీశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చేతులు కలిపారని ఆరోపించారు.  ప్రధాని నరేంద్ర మోదీకి, నితీశ్‌‌‌‌కు దళితులంటే పట్టింపులేదని, వాళ్లు కేవలం కుర్చీ గురించి మాత్రమే ఆలోచిస్తారని ఖర్గే విమర్శించారు.

అందుకే రాజీపడొద్దని బిహార్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బిహార్‌‌‌‌‌‌‌‌ సీఎంగా 9 సార్లు ప్రమాణం చేసి 20 ఏండ్లు పాలించిన నితీశ్‌‌‌‌.. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. రాష్ట్రం నుంచి యువకుల వలసలు కూడా ఆగలేదన్నారు.

ఇంట్లో పెండ్లి మాదిరి ప్రచారంలో మోదీ బిజీ

ప్రధానికి వరల్డ్‌‌‌‌ టూర్లకు టైం ఉందిగానీ, దేశంలో పేదల గురించి పట్టించుకునే తీరిక లేదని ఖర్గే విమర్శించారు. ఎక్కడ ఎన్నికలొచ్చినా ఆయన  ప్రత్యక్షమవుతారన్నారు. మున్సిపల్‌‌‌‌ ఎన్నికలొచ్చినా వీధుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తారన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆదే రీతిలో ఆయన ప్రచారం కొనసాగుతోందన్నారు. 

తన ఇంట్లో పెండ్లి మాదిరిగా మోదీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్‌‌‌‌కు సీఎంగా 13 ఏండ్లు, దేశానికి పీఎంగా 12 ఏండ్లు ఉన్న మోదీ తన సొంత రాష్ట్రాన్నే డెవలప్‌‌‌‌ చేయలేకపోయారని విమర్శించారు. సొంత రాష్ట్రాన్నే మార్చలేనివాళ్లకు ఇప్పుడు మళ్లీ ఓట్లు వేస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. చాలా సమయం దేశం బయట ఉండే మోదీకి కాకుండా సరైన వ్యక్తులకు ఓటు వేయాలని కోరారు. 

మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా వచ్చి జంగిల్‌‌‌‌ రాజ్‌‌‌‌ను తొలగించాలని చెప్తారని, మరి 20 ఏండ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీయే ఆ పని ఎందుకు చేయలేకపోయిందని ఖర్గే ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 50 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి గురించి మోదీ పట్టించుకోరని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వాటి గురించి ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై దేశ ద్రోహం కేసులు పెడుతున్నారని ఖర్గే ఆరోపించారు.