
- లిక్కర్ స్కామ్లో మహిళ ఉండొచ్చు గానీ.. నేను మాత్రం రాజకీయాలు చేయొద్దట: షర్మిల
- పోలీసుల నోటీసుకు సమాధానం ఇచ్చినం..
- పాదయాత్రకు పర్మిషన్ ఇయ్యకపోతే కోర్టుకు పోతం
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గుండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో మహిళ ఉండొచ్చు కానీ.. తాను మాత్రం రాజకీయాలు చేయెద్దట అని మండిపడ్డారు. ఆదివారం లోటస్ పాండ్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు, తన పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా పోలీసులు అడ్డుకుంటూ, అనుమతి ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం, పోలీసులు ఉల్లంఘిస్తున్నారన్నారు. పర్మిషన్ కోసం వరంగల్ సీపీ దగ్గర శనివారం రాత్రి 11.30 గంటల వరకు తమ పార్టీ నేతలు వెయిట్ చేసినా, అనుమతి ఇవ్వకుండా నాకు షోకాజ్ నోటీసు జారీ చేశారని షర్మిల గుర్తు చేశారు. ఆ నోటీసుకు ఆన్సర్ ఇచ్చామని, రెండు రోజులు వెయిట్ చేసి యాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్తామని చెప్పారు.
టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు
రుణమాఫీ, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి లాంటి హామీలు అమలు చేయనందుకు రాష్ట్ర ప్రజలే సీఎం కేసీఆర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ లో తనను అరెస్ట్ చేసి మహిళ అని కూడా చూడకుండా 8 గంటలు పోలీసు స్టేషన్లో ఉంచారని, రిమాండ్ కు పంపాలని ట్రై చేశారన్నారు. ఇదంతా చూస్తుంటే పోలీసులను తన సొంత జీతగాళ్లలా, టీఆర్ఎస్ కార్యకర్తల్లా కేసీఆర్ ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. బస్సును కాలబెట్టిన, కార్ల అద్దాలు పగలగొట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయలేదని, అరెస్ట్ చేయలేదన్నారు.
రూల్స్ బ్రేక్ చేయలేదు: వైఎస్సార్టీపీ
పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడా తాము రూల్స్ బ్రేక్ చేయలేదని వైఎస్ఆర్టీపీ లీగల్ సెల్ చైర్మన్, సుప్రీం కోర్టు అడ్వకేట్ వరప్రసాద్ అన్నారు. సర్కారు వైఫల్యాలు ఎత్తి చూపటం నేరం కాదన్నారు. యాత్రలో జాగ్రత్తలు తీసుకుంటామని కోర్టుకు తెలిపినా పోలీసులు నిరాకరించారన్నారు.