ప్రశ్నిస్తే వేధింపులు.. సర్కారు తీరుపై నెటిజనుల అసంతృప్తి

ప్రశ్నిస్తే వేధింపులు.. సర్కారు తీరుపై నెటిజనుల అసంతృప్తి
  • పోలీసులు, టీఆర్​ఎస్​ లీడర్లు బెదిరిస్తున్నారని ఆవేదన
  • ఖమ్మంలో సాయి గణేశ్​ పై ఏకంగా 16 కేసులు.. 
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఇంకెన్నో

కటౌట్లపై విమర్శిస్తే..
మేళ్లచెరువు లో మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే పేరుతో టీఆర్​ఎస్​ నేతలు భారీగా స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటుచేశారు. దీనిని విమర్శిస్తూ అన్నెపంగు రామయ్య, బుస్సా నర్సింహారావు, బేత సైదిరెడ్డి వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టారు. దీంతో ముగ్గురిపై  కేసులు ఫైల్​ చేశారు. 

భూకబ్జాలపై నిలదీస్తే..
మందమర్రికి చెందిన  హైకోర్టు లాయర్ ఎం. వెంకటేశ్ టీఆర్ఎస్ లీడర్ల భూకబ్జాలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయనకు  చంపేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆయనపైనే ఉల్టా కేసులు పెట్టారు. 

డబుల్​ బెడ్రూం అడిగితే..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన సైదులు  తనకు ‘డబుల్ బెడ్రూం’ ఇవ్వలేదని మంత్రి జగదీశ్ రెడ్డి పై వీడియో తీసి పోస్టు పెట్టాడు. దీనిపై టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో, సైదులుపై పోలీసులు పీడీయాక్ట్ పెట్టారు. ఠాణాలో 4రోజులు ఉంచి కొట్టడంతో సైదులు ఊరొదిలి పోయాడు.
 

ఖమ్మం/నెట్​వర్క్, వెలుగు: ఖమ్మం జిల్లాకు చెందిన  బీజేపీ కార్యకర్త సామినేని సాయి గణేశ్​ సూసైడ్​పై రాష్ట్రవ్యాప్తంగా సోషల్​ మీడియాలో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తప్పులు ఎత్తిచూపితే నేరమా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సర్కారు ప్రోద్బలంతో లోకల్​ లీడర్లు పోలీసులపై ఒత్తిడి notenotenతెచ్చి ప్రతిపక్షాలను, సామాన్యులను వేధిస్తున్నారని మండిపడుతున్నారు. 

మంత్రి పువ్వాడ అజయ్​కి వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టాడని, ఒక మత చిహ్నాన్ని  కూల్చేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ సాయి గణేశ్​ పై పోలీసులు ఏకంగా 16 కేసులు పెట్టి రిమాండ్ చేశారు. రౌడీ షీట్ కూడా ఓపెన్​ చేశారు.  టీఆర్​ఎస్​ లీడర్లు, పోలీసుల వేధింపులు  భరించలేక సాయి గణేశ్​ సూసైడ్​ చేసుకోవడంతో రాష్ట్ర సర్కారు, పోలీసుల తీరుపై నెటిజన్లు సోషల్​ మీడియా వేదికగా మండిపడుతున్నారు.  

సాయి గణేశ్​పై కేసుల మీద కేసులు
ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ కు చెందిన సాయి గణేశ్​పై మూడేండ్లలో పోలీసులు 16 కేసులు నమోదు చేశారు. బీజేపీ తరపున పలు ఆందోళనల్లో పాల్గొన్నాడని, సోషల్ మీడియాలో మంత్రి పువ్వాడ అజయ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడనే కారణాలతో 143, 332, 153(A), 295(A), r/w 149 ఐపీసీ,  290, 294(b), 504, 506, 507, 110(E), Sec 67 of IT Act, Sec 7(1)(a) of CRL ఇలా రకరకాల సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. గతేడాది ఒక మతానికి చెందిన చిహ్నాన్ని కూల్చేందుకు ప్రయత్నించారనే కేసులో సాయి గణేశ్​ ను రెండు వారాల పాటు రిమాండ్ చేశారు. ఈ ఇష్యూ తర్వాత ఈ ఏడాది జనవరి 5న ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సాయి గణేశ్​పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత దీన్ని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. రౌడీ షీట్ నమోదైనప్పటి నుంచి రెగ్యులర్ గా పోలీసులు తన మనుమడిని స్టేషన్ కు అర్ధరాత్రి వేళ తీసుకెళ్లి వేధించారని సాయి గణేశ్​ అమ్మమ్మ చెప్తున్నారు.  

కోర్టు అనుమతి లేకుండానే..!
సోషల్​మీడియా ద్వారా ప్రభుత్వాన్ని గానీ, ప్రజాప్రతినిధులనుగానీ కించపరిన వ్యక్తులపై ఐపీసీ చట్టంలోని 506, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలంటే గతంలో నాన్​కాగ్నిజల్​అఫెన్సెస్​కింద కోర్టు పర్మిషన్​ తీసుకోవాల్సి వచ్చేది.  ఈ క్రమంలో 2018లోనే ఈ రెండు సెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. అప్పటి నుంచి పోలీసులు కాగ్నిజబుల్ అఫెన్సెస్​ అంటూ కోర్టు అనుమతి లేకుండా నేరుగా 506, 507 కింద  కేసులు నమోదు చేస్తున్నారు.  పరుష పదజాలంతో దూషించడం, బెదిరించడం, కించపరచడం చేస్తే ఐపీసీ సెక్షన్​ 506 కింద, నేరాన్ని ప్రేరేపించడం లాంటి పరోక్ష బెదిరింపులకు పాల్పడితే సెక్షన్‌ 507 కింద రెండు నుంచి ఏడేండ్ల లోపు  జైలు శిక్ష విధించే అవకాశం ఉండడంతో ప్రతిపక్ష లీడర్లు, సోషల్​ యాక్టివిస్టులపై టీఆర్​ఎస్​ లీడర్లు ప్రతాపం చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఘటనలు
ఈ నెల 10న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని నల్ల మట్టి దందాపై  ప్రశ్నిస్తూ బీజేవైఎం నేత విజయ్​భాస్కర్​రెడ్డి సోషల్​ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకున్న కొందరు..  విజయ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు. అడ్డం వచ్చిన విజయభాస్కర్​రెడ్డి తల్లిదండ్రులపైనా చేయి చేసుకున్నారు. తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి, తల్లి రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఓ టీవీ రిపోర్టర్ పై దౌర్జన్యం చేసి వీడియో డిలీట్ చేయించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు ధర్నా చేసి ఎస్పీని కలిసినా ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. పైగా పోలీసులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని దూషించాడని ఆరోపిస్తూ  ఈ నెల 12న విజయ భాస్కర్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు ఫైల్​ చేశారు. 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక సందర్భంగా జరిగిన  మీటింగ్​లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్​పై చెన్నూరు ఎమ్మెల్యే  బాల్క సుమన్ ‘తోలు తీస్తా’ అని కామెంట్​ చేశాడు. సుమన్  తోలు తీస్తున్నట్లుగా ఉన్న కార్టూన్​ను మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన బీజేపీ లీడర్ నీరటి వెంకటేశ్  తన వాట్సాప్​స్టేటస్​గా పెట్టాడు. దీనిపై అదే రోజు మందమర్రి పోలీస్​స్టేషన్​లో వెంకటేశ్​పై  కేసు పెట్టారు.

పోస్టులు పెడితే కేసులు పెడుతున్రు.. 
మంత్రి కొప్పుల ఈశ్వర్ అక్రమాలపై ప్రశ్నించినందుకు అతని అనుచరులు 2017 నుంచి నాపై కక్ష కట్టిన్రు. బుగ్గారం పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు పెట్టిన్రు. ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేసిన్రు. కరీంనగర్​లో ఉండే మా బావపైనా కేసు పెట్టిన్రు. అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రౌడీషీట్ ఓపెన్ చేసి, జీవితంలో దేనికీ పనికి రాకుండా చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నరు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక గతంలో ఎస్పీ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాను. అయినా నాకు న్యాయం జరగలేదు. - చిట్ల విజయ్, గోపులపూర్, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా

అసెంబ్లీలో ఎమ్మెల్యే నిద్రపోతున్న ఫొటో షేర్ చేసినందుకు..!
నిరుడు ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి అసెంబ్లీలో నిద్రపోతున్న ఫొటో వాట్సప్ గ్రూప్​లో వచ్చింది. సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యే నిద్రపోవడం ఏంది అని మరో గ్రూపులో ఫార్వర్డ్ చేశాను. అదే నేను చేసిన నేరమట! నన్ను, నాతో పాటు సిలవేరు సంపత్​ అనే మరో వ్యక్తిని పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లి వేధించారు. మా ఆధార్ కార్డు తీసుకొని, వైట్​ పేపర్ల మీద సంతకాలు తీసుకొని పంపించారు. అప్పటి నుంచి లీడర్లను ప్రశ్నించాలంటేనే భయపడుతున్నాం. - అనిల్​, కిష్టంపేట, కాల్వ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా.