వేతనాలు అడిగితే వేధిస్తారు.. ఉద్యోగాల్లోంచి తీసేస్తామంటున్నారు

వేతనాలు అడిగితే వేధిస్తారు.. ఉద్యోగాల్లోంచి తీసేస్తామంటున్నారు

హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన డిక్యూ ఎంటర్ టెయిన్మెంట్ యానిమేషన్ కంపెనీ ఉద్యోగులు

ఆరు నెలల్నుంచి జీతాలివ్వకపోవడంతో 1400 మంది రోడ్డునపడ్డామని ఆవేదన

హైదరాబాద్: వేతనాలు అడిగితే వేధిస్తారు.. ఉద్యోగాల్లోంచి పీకేస్తామని బెదిరిస్తున్నారంటూ డీక్యూ ఎంటర్ టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (యానిమేషన్)  కంపెనీ ఉద్యోగులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. భారీ సంఖ్యలో ఉద్యోగులు ఇవాళ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. కంపెనీ ఎండి తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని… తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను వేడుకున్నారు.

ఆరు నెలల నుంచి జీతాలు లేక 14వందల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డామని వారు కమిషన్ కు వివరించారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 14లక్షలు చొప్పున రావాల్సి ఉందని ఉద్యోగులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం పై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు గురించి అడిగితే వేధింపులకు గురి చేయడమే కాకుండా… కంపెనీ నుంచి తొలిగిస్తామని బెదిరింపులకు పాలుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండి తపాస్ చక్రవర్తి పాస్ పోర్టు సీజ్ చేసి… అతని పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని… తమకు న్యాయం చేయాలని బాధితులు కమిషన్  వేడుకున్నారు.