ఇక్కడ చెప్పే ఆర్ట్​ క్లాసులు చూస్తే.. ‘క్లాసే ఒక ఆర్ట్​’ అని ఒప్పుకుంటరు

ఇక్కడ చెప్పే ఆర్ట్​ క్లాసులు చూస్తే.. ‘క్లాసే ఒక ఆర్ట్​’ అని ఒప్పుకుంటరు
ఖుషీ.. ఖుషీగా.. క్లాస్​! స్ర్టెస్​ని తగ్గించుకోవాలంటే పెయింటింగ్స్​ గీయాలని శానా మంది చెప్తరు. తలభారం తగ్గించుకోనీకి ఆర్ట్​ నేర్చుకుందామని పోతే… అక్కడ ఆఫీస్​ వర్క్​ని మించిన స్ర్టెస్! ఇప్పుడేం జేయాలని తెల్లబోకుండ.. ‘అర్టోచీనొ స్టూడియో’కి రండి. ఇక్కడికి నచ్చినప్పుడు రావొచ్చు. మ్యూజిక్​ వింటా బొమ్మలు గీయొచ్చు. కాఫీలు తాగుతా క్లాస్​ వినొచ్చు. ఫ్రెండ్స్​ని గూడ తీస్కపోయి ఎంజాయ్​ చేయొచ్చు. ఇక్కడ చెప్పే ఆర్ట్​ క్లాసులు చూస్తే ‘క్లాసే ఒక ఆర్ట్​’ అని ఒప్పుకుంటరు. ఆర్ట్​ నేర్చుకోవాలని చానామంది పెద్దోళ్లకుంటది. నేర్చుకుందామంటే.. టైం ఉండదు. ఉంటే.. ఎంకరేజ్​మెంట్​ఉండదు. రిలాక్స్​ కోసమనే ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటరు. అట్లని, ఆర్ట్​ క్లాసులకు పోతే రిలాక్సేషన్​ ఉండదు. కోర్సులో చేరామంటే ఇన్ని క్లాసులని లెక్క ఉంటది. అన్ని రోజుల్లో కచ్చితంగా ఆ క్లాసులు వినాలె, ప్రాక్టీస్​ చేయాలె. గంతె. ఇంకో ముచ్చటే లేదు. గిట్లనే చానా మంది ఆర్ట్ నేర్చుకోవాలన్న ఆలోచనకు పుల్​స్టాప్​ పెడతరు. నేర్చుకునేటోళ్లు పక్కవాళ్లని చూసి సెల్ఫ్​ కాన్సిడెన్స్​ పోయి, మానేస్తరు. ఇసుంటి రూల్స్​ని బ్రేక్​ చేసిన స్టూడియో ‘అర్టోచీనొ’. హైదరాబాద్​లోని మాదాపూర్​లో నెలన్నర కింద దీనిని స్టార్ట్​ చేసినరు. ఇక్కడ నేర్పేవాళ్లు రూల్స్​ పెట్టలే.  నేర్చుకోవాలనుకునేవాళ్లు స్వేచ్ఛగా నేర్చుకోవచ్చు. అర్టోచీనొ స్టూడియోని శ్వేత స్టార్ట్​ చేసింది. తను మంచి ఆర్టిస్ట్​. ‘పిట్ట కొంచెమైనా కూత ఘనం’ అన్నట్టు  ఇంటర్మీడియెయట్​ ఫస్ట్​ ఇయర్​లోనే పెయింటింగ్​ ఎగ్జిబిషన్​ చేసింది. ఒక్కో పెయింటింగ్​ని పాతిక వేలకు అమ్మింది. చిన్న వయసులో అంతెత్తుకు చేరిందంటే.. ఎంత చిన్న వయసులో ట్రావెల్​ మొదలుపెట్టిందో! ఇంటికి వచ్చే పేపర్​లో ఆదివారం పుస్తకంలో చుక్కలు కలిపి బొమ్మలు గీసి, బొమ్మలకు రంగులద్ది, వాటినే వేరే కాగితంపై డిటో దింపిందట. బిడ్డ గీసిన బొమ్మలు చూసి వాళ్లమ్మ మస్త్​ ముచ్చటపడి డ్రాయింగ్​ స్కూల్లో చేర్పించింది. అక్కడ మొదలైంది అసలు కథ. స్ర్టెస్​ స్ర్టాటజీ శ్వేత మూడో తరగతి చదివేప్పుడు ఆర్ట్​ నేర్చుకోడానికి డైలీ క్లాసులకు, సమ్మర్​ క్లాసులకు పోయేది. ఆమెకు ఆర్ట్ అంటే బాగా ఇష్టం. సంగీతం అంటే కూడా ఇష్టమే. అప్పటికే కర్నాటక సంగీతం నేర్చుకుంది. ఇళయరాజా పాటలు వినకుండా ఆమెకు రోజు గడవదు. ఆ పాటలు వింటేనే ఆమె హ్యాపీగా ఉంటుంది. కానీ, ఆర్ట్​ క్లాసులు చాలా స్ర్టిక్ట్​ పద్ధతుల్లో ఉంటయ్​. ఫోన్​ వాడకూడదు. మ్యూజిక్​ వినకూడదు. ఖాళీగా ఉండకూడదు. ఇష్టం లేకున్నా కష్టంగానైనా ప్రాక్టీస్​ చేయాల్సిందే. ‘ఇదేం క్లాసురా బాబు’ అని తలపట్టుకునేది. ఇట్లాంటి ఇబ్బంది లేకుంటే ఇంకా బాగా నేర్చుకోవచ్చని శ్వేత అనుకునేది. ఎట్లయితేనేం కష్టపడి నేర్చుకున్నది. ఆ తర్వాత ఆరేళ్లు కష్టపడి ప్రొఫెషనల్​ ఆర్టిస్ట్​గా  ఇంప్రూవ్​ చేసుకున్నది. మూడు ఎగ్జిబిషన్స్​ కూడా చేసింది. ఇంటర్మీడియెట్​ తర్వాత కొంచెం చదువు మీద ఎక్కువ ఇంట్రస్ట్​ చూపించింది. లండన్​ పోయి ఫైనాన్స్​ అండ్​ అకౌంటింగ్​లో మాస్టర్​ డిగ్రీ చేసి వచ్చింది. వచ్చిన కొద్ది నెలలకే లాక్​ డౌన్​ పెట్టినరు. ఇప్పుడు వర్క్​ఫ్రమ్​ హోమ్​, కోవిడ్ భయంతో జనంలో మెంటల్​ స్ర్టెస్​ పెరిగింది. అది తగ్గించడానికి పెయింటింగ్స్​ గీయమని చెబితే ఎవరు గీస్తరు? తనలాగే నేర్చుకోవడానికి ఇంకొంచెం స్ర్టెస్​ని తలకెక్కించుకోవడానికి ఎవరు సాహసిస్తరు? అందుకే ఆర్ట్​ని ఆడుతూ, పాడుతూ, హాయిగా గీస్తూ, ఇష్టంగా నేర్చుకునే స్టూడియోని స్టార్ట్​ చేసింది. ప్యాషన్​కి పేరెంట్స్​ సపోర్ట్​ శ్వేతకు ఆర్ట్​ కన్నా ఫైనాన్స్​ అండ్​ అకౌంటింగ్స్​ చాలా ఇష్టం. కానీ దాని ప్రయారిటీ ఇప్పుడు మారింది. పరిస్థితులే ఇట్ల మార్చినయని శ్వేత అంటున్నది. అమ్మాయి ఆర్ట్​ స్టూడియో పెడతనంటే.. ‘పెద్ద కంపెనీలో చేరాలె, మంచి ఉద్యోగం చేయాలె’ అని అమ్మానాన్న వద్దనలేదట. ‘నచ్చినపనే చెయ్’ అన్నరు. అవరసమైనంత డబ్బులిచ్చి సపోర్ట్ చేసినరు. అట్ల శ్వేత ప్యాషన్​, వాళ్ల పేరెంట్స్​ ఫైనాన్స్​తో ఈ స్టూడియో స్టార్ట్​ అయింది. ఆర్ట్​ అంటేనే రిలాక్సేషన్​ నేను చాలా స్ర్టిక్ట్​ . ఎన్విరాన్​మెంట్​లో ఆర్ట్​ నేర్చుకున్నాను. కోర్స్​ ఇలాగే పూర్తి చేయాలనే రూల్​ ఉండేది. పాటలు వినకూడదు, పాడకూడదు. కానీ, సంగీతం లేకుండా ఉండలేను. ఇంకా ఫ్రీగా ఉంటే ఎంతో బాగుండేది. నేను ఇన్ని క్లాసులని కోర్సుకి కమిట్​మెంట్​ ఇవ్వకపోయినా అన్ని విషయాలూ నేర్పిస్తాను. వాళ్లు నేర్చుకోలేక పోయినా ఫర్వాలేదు. కానీ, నేర్చుకోవాలనే కోరిక వదులుకోకూడదు. అందుకే చుట్టూ చెట్ల మధ్య ట్రెడిషనల్​గా ఉండే ఇంట్లో ఈ స్టూడియో స్టార్ట్​ చేశాను. ఆర్ట్​ ఎప్పుడూ రిలాక్సేషనే. నేర్చుకున్నా, నేర్పినా హ్యాపీనెస్​ ఇస్తది. – శ్వేత ధూళిపాళ హ్యాపీగా… జాలీగా అర్టోచీనొ స్టూడియోకి ఉత్తచేతులతో పోతే చాలు. ఆర్ట్​ మెటీరియల్ అంతా వాళ్లే ఇస్తరు. ఇష్టముంటే డ్రాయింగ్​ గీయొచ్చు. ఇష్టం లేదంటే హాట్​ కాఫీ ఇస్తరు. కాఫీ తాగుతూ ఫ్రెండ్స్​తో  ముచ్చట్లు పెట్టొచ్చు. బుద్ది మారితే మళ్లీ డ్రాయింగ్​ గీయొచ్చు. డౌట్స్​ ఉంటే శ్వేతని అడగొచ్చు (అదే ఇక క్లాస్). మూడ్​ మారిందంటే వదిలేసి పోవచ్చు. రేపొచ్చి కంటిన్యూ చేయొచ్చు. పేయింటింగ్​ని ఇంటికి తీసుకపోవచ్చు. మ్యూజిక్, మూవీస్, ఈటింగ్, చాటింగ్​తో సాగే ఆర్ట్ క్లాస్​లకి 40 మంది దాకా వస్తున్నరు. ఆర్ట్​ ఎట్ల గీస్తరో చూద్దామని వచ్చినోళ్లు కూడా ‘ఇంతేనా’ అని బ్రష్​ పట్టి, రంగులు అద్దడం మొదలుపెట్టినోళ్లూ ఉన్నరు. :::నాగవర్ధన్​ రాయల