బంకుల దగ్గర నో స్టాక్( No Stock) బోర్డులకు కారణం ఇదే : ఈ రీజన్ తెలిస్తే ప్రశాంతంగా ఉంటారు..!

బంకుల దగ్గర నో స్టాక్( No Stock)  బోర్డులకు కారణం ఇదే : ఈ రీజన్ తెలిస్తే ప్రశాంతంగా ఉంటారు..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ సిటీ మొత్తాన్ని ఆగమాగం చేస్తున్న పెట్రోల్, డీజిల్ కొరత, బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులకు కారణాలను వెల్లడించింది తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్. బంకుల దగ్గర క్యూలు, కొన్ని బంకులు మూతబడటానికి కారణాలను స్పష్టంగా చెప్పేసింది. ఈ రెండు కారణాల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వివరించింది. జనం అంతా ఈ విషయాన్ని గమనిస్తే.. అవగాహన చేసుకుంటే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనే స్పష్టం అవుతుంది. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

‘సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్  ఏం చెప్పారంటే.. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ (LPG) కొరత లేదు. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దు.  తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదు.  ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా, సక్రమంగా పనిచేస్తోంది.  అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి.  కొన్ని పెట్రోల్ బంకులలో భారీ క్యూలు ,తాత్కాలికంగానో స్టాక్ బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం, తప్పుడు వదంతుల వల్ల ప్రజలు భయపడి అకస్మాత్తుగా ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడటమే.  డిపోలలో తగినంత ఇంధనం ఉన్నప్పటికీ, ప్రజలు అనవసరంగా తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోంది.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ముందస్తు చెల్లింపు  విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల స్థానిక డీలర్లకు చిన్నపాటి తాత్కాలిక  సమస్యలు ఎదురయ్యాయి.ఇది కేవలం అంతర్గత పరిపాలన పరమైన విషయం మాత్రమే తప్ప, సరఫరాలో లోపం కాదు.పరిస్థితిని చక్కదిద్ది, అందరికీ సమానంగా ఇంధనం అందేలా చూడటానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీసు శాఖతో కలిసి పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తోంది.ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ చేసినా లేదా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు అక్రమంగా మళ్లించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.

ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలతో అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దు.  దయచేసి ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి.  సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని  వాటిని ఇతరులకు పంపవద్దని (forward చేయవద్దని) కోరుతున్నాము.  ఏవైనా సందేహాలు ఉన్నా లేదా అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా, ప్రజలు పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1967 ను సంప్రదించగలరు’ అని తెలిపారు.