వెనక్కి వస్తావా.. పేల్చేయమంటావా : పాక్ నౌకకు ఇరాన్ వార్నింగ్..!

వెనక్కి వస్తావా.. పేల్చేయమంటావా : పాక్ నౌకకు ఇరాన్ వార్నింగ్..!

యుద్ధ భూమిలో ఇరాన్ తన పట్టును మరోసారి నిరూపించుకుంటోంది. తాజాగా పాకిస్థాన్‌కు వెళ్తున్న ఒక భారీ కంటైనర్ నౌకను ఇరాన్ సైన్యం అడ్డుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 'సెలెన్' అనే నౌకను ఇరాన్ నిలిపివేసింది. జలసంధి దాటేందుకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పింది. వెంటనే వెనక్కి పోతావా.. లేక పేల్చేయమంటావా అనే స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ కమాండర్ అలీరెజా తంగ్‌సిరి ఈ ఘటనను ధృవీకరించారు. పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన ఈ నౌకకు అసలు హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే అనుమతే లేదని ఆయన స్పష్టం చేశారు. సముద్రయాన ప్రోటోకాల్స్‌ను పాటించడంలో విఫలమవ్వడమే కాకుండా.. ఇరాన్ సముద్ర అధికార యంత్రాంగంతో కనీస సమన్వయం లేకుండా ప్రవేశించడానికి ప్రయత్నించినందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తే ఏ దేశ నౌకనైనా సరే అనుమతించే ప్రసక్తే లేదని ఇరాన్ పరోక్షంగా పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపింది. దీంతో పాక్ నౌక చేసేదేం లేక వెనక్కు తిరిగి వెళ్లిపోయింది.

ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఇప్పుడు పూర్తి నియంత్రణ సాధించింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాలకు సహకరించే ఏ దేశ నౌకనైనా తాము అడ్డుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఒకవైపు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ఒప్పందాన్ని ముందుకు తెస్తున్నా.. ఇరాన్ మాత్రం ఆ చర్చలను తోసిపుచ్చడమే కాకుండా పాక్ నౌకలనే అడ్డుకోవడం ద్వారా తన కఠిన వైఖరిని ప్రదర్శించిందని నిపుణులు అంటున్నారు.

ఈ ఘటనతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు మళ్లీ ఉలిక్కిపడ్డాయి. ముడిచమురు ధరలు 100 డాలర్ల కంటే దిగువకు వస్తాయని ఆశించిన తరుణంలో.. ఇలాంటి ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే కాకుండా, ఎరువుల రవాణా కూడా నిలిచిపోవడంతో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది. ఇరాన్ తీరు చూస్తుంటే.. గల్ఫ్ దేశాల మధ్య దౌత్యం కంటే యుద్ధ తంత్రాన్నే ఎక్కువగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.