చమురు సంక్షోభంతో ప్రపంచం అల్లకల్లోలం అవుతున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ ఇండియాకు ఆపన్నహస్తం అందించింది రష్యా. ఇండియాకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. అందుకు సంబంధించిన డీల్ కూడా పూర్తయ్యిందని.. ఏప్రిల్ లో భారత్ కు చమురు చేరుకుంటుందని ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది.
చమురు సరఫరా నుంచి బయటపడేందుకు తన చిరకాల స్నేహితుడు రష్యా నుంచి ఇండియా క్రూడ్ కొనుగోలు చేసింది. మొత్తం 60 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ను ఇండియన్ రిఫైనరీలు కొనుగోలు చేశాయి. 5 నుంచి 15 డాలర్ల ప్రీమియంతో కార్గోస్ బుక్ చేసినట్లు బ్లూంబర్గ్ నివేదికలో వెల్లడించింది.
ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ నుంచి ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా రష్యా నుంచి నెల రోజుల పాటు ఆయిల్ కొనుగోలు చేయవచ్చునని యూఎస్ మినహాయింపులు ఇచ్చిన క్రమంలో.. ఇండియా లేటెస్టుగా రష్యా నుంచి భారీ ఎత్తున క్రూడ్ కొనుగోలు చేసినట్లు టాక్. మార్చి 5 కు ముందే క్రూడ్ ఆయిల్ నౌకలలోకి లోడ్ చేసినట్లు సమాచారం.
►ALSO READ | పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచం.. పెంచబోం.. పెంచేది లేదు
అయితే రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఇండియాకు క్రూడ్ ఆయిల్ వస్తోంది. వెనుజులా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోలు చేసింది. దాదాపు 8 మిలియన్ బ్యారెళ్ల చమురు ఏప్రిల్ లో ఇండియాకు చేరుకోనుంది. 2020 అక్టోబర్ తర్వాత వెనుజులా నుంచి ఇంత భారీ మొత్తం కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. పెట్రోల్, డీజిల్ కొరతతో ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో రష్యా, వెనుజులా నుంచి ఆయిల్ వస్తుండటం ఇండియాకు కాస్త ఉపశమనంగా అధికార వర్గాలు భావిస్తున్నాయి.
