ఇప్పసారాపై అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ఇప్పసారా గురించి చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఇప్ప సారాకి ఇందిరమ్మ పేరు పెట్టకండి.. అంటూ కామెంట్స్ చేయడంతో అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను సభలో తీవ్రంగా తప్పుపట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీ రికార్డ్స్ నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఇందిరమ్మ పేరుని అవమనిస్తారా.? అని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వర్గస్తులైన ఇందిరగాంధీ పై సభలో కామెంట్స్ చేసిన రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ప్రొటెం స్పీకర్ బాలు నాయక్ సూచించారు. సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు.
రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు:
అసెంబ్లీలో అనిరుధ్ రెడ్డి లేవనెత్తిన ఇప్ప సారా అంశంపై బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్ప సారా ఉత్తర తెలంగాణకు ఉపయోగపడే అంశమని అన్నారు. టకీలా అని అనిరుధ్ రెడ్డి మంచి పేరు పెట్టారన్నారు. కల్తీ కల్లు, కల్తీ మద్యం తాగి ఉత్తర తెలంగాణ ప్రజల శరీరాలు శవాలుగా మారుతున్నాయని.. ఇప్ప సారాతో మార్పు తీసుకురావచ్చన్నారు. ఇప్ప సారా ఆర్గానిక్ విస్కీ అని.. కల్తీ మద్యం, అల్ఫజోలం కళ్ళు కంటే ఇప్ప సారా మంచిదన్నారు. ఈ క్రమంలో ఇప్పసారా గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పసారాకు ఇప్ప టకీలా అనండి ఇంకేమైనా పేరు పెట్టండి కాని ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి.. అని అనటంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది.
ఇప్పసారాతో భారీ ఆదాయం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
2026 మార్చి 25న అసెంబ్లీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పసారా అంశాన్ని లేవనెత్తారు. సారా దుకాణలు ఓపెన్ చేయాలనీ చెప్తే.. సోషల్ మీడియా లో తనను ట్రోల్స్ చేస్తున్నారని అన్నారు. 1995 కి ముందు సారా దుకాణలు ఉండేవని చెప్పారు. 1978,79 సమయంలో సారాతో ఆదాయం రూ.91 కోట్ల వరకు వచ్చేదని.. విదేశీ మద్యంతో రూ.8 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చేదని తెలిపారు.
ఎందుకంటే కల్తీ సారా కాయడం, హెల్త్ ఇష్యూస్, ఇంట్లో గొడవలు వంటివి అయ్యేవి కాబట్టి 1995 లో సారా ని బ్యాన్ చేశారన్నారు. కల్తీ సారాకు తాను కూడా వ్యతిరేకమే అని.. కానీ తాను ఇక్కడ మాట్లాడేది కేవలం ఇప్పపువ్వు గురించి మాత్రమేనని అన్నారు. 1995 వరకు సారా మీద రూ.350 పై కోట్ల ఆదాయం వచ్చేదని.. 1995 లో సారా బ్యాన్ చేసిన తర్వాత.. 1996,97 లో విదేశీ మద్యం తో ఆదాయం రూ.700 కోట్లకు పైగా వచ్చినట్లు తెలిపారు.
సారా బ్యాన్ చేయడం వల్ల తాగడం ఆపలేదని.. సారాకి బదులు విదేశీ, స్వదేశి మద్యం తాగుతున్నారుని తెలిపారు అనిరుధ్ రెడ్డి. సారాకు తాను వ్యతిరేకం అని చెబుతూనే.. ఇప్పపువ్వు ప్రాముఖ్యతను గురించి తాను మాట్లాడుతున్నట్లు వివరణ ఇచ్చారు. ఇప్పపువ్వు తో వచ్చే లిక్విడ్ ని సురా, స్పిరిట్ అని అనొచ్చన్నారు. మేక్సికో, జపాన్, ఫ్రాన్స్, స్కోట్లాండ్, చైనా ఇతర దేశాలు వారి ఓన్ ప్రోడక్ట్ తో లిక్కర్ ఎగుమతి చేసి వేల కోట్ల టర్నోవర్ చేసుకుంటున్నారని తెలిపారు.
ఇప్పచెట్టు కి 5వేల ఏళ్ల చరిత్ర ఉందని.. దీని ద్వారా ఆదివాసులను, ఎస్టీలను ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయొచ్చు అనేదే తాను మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మేక్సికో, చైనాలో ఓన్ ప్రోడక్ట్ తో టాకీలా, మౌకై అని.. అలాగే ఇతర దేశలో కూడా అనేక రకాల మందు చేసి అమ్ముకొని వేల కోట్ల ఆదాయం తీసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇప్పపువ్వు తో కేక్స్, ఐస్ క్రీమ్, వైన్, బీర్, ఇప్పలడ్డు చేయొచ్చని అభిప్రాయపడ్డారు. వీటిని మనం బాగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆలోచన చేసి బాగా ప్రమోట్ చేస్తే.. ఆదివాసీలకు, ఎస్టీలకు ఆదాయం పెంచొచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు.
