- త్వరలో కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తాం
- రూ.వెయ్యి కోట్లతో చెన్నూరులో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడి
- మంచిర్యాల జిల్లాలో ఆయుధ, వాహన పూజలకు సతీసమేతంగా హాజరు
కోల్ బెల్ట్/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: సింగరేణికి కొత్త గనులు దక్కితేనే కోల్ బెల్ట్ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలంలో సింగరేణి పాల్గొని కొత్త బొగ్గు గనులను దక్కించుకొనేలా రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తుందని చెప్పారు. దసరా పండుగను పురస్కరించుకొని మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి-, సరోజ దంపతులు పర్యటించారు.
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్, బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో దసరా, రామ్ లీలా సంబురాలకు మంత్రి వివేక్ దంపతులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జడ్జి నిరోషా, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, -శ్రీవాణి దంపతులు, సింగరేణి గుర్తింపు సంఘం స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు. మందమర్రిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం మంత్రి వివేక్ దంపతులు, కలెక్టర్, లీడర్లతో కలిసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌కు తీసుకొచ్చారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి వివేక్ ఆయుధ పూజ, వాహన పూజలు చేశారు. భీమారం, మందమర్రిలో దుర్గామాతను దర్శించుకున్నారు.
కేసీఆర్ వల్లే కొత్త గనులు రాలే..
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటారని మంత్రి వివేక్ అన్నారు. బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియ చట్టానికి బీఆర్ఎస్ సర్కార్ మద్దతు పలికిందని, కానీ వేలంలో పాల్గొనకుండా సింగరేణిని అడ్డుకుందని ఆరోపించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే కొత్త గనులు రాలేదన్నారు. రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్2 కొత్త మైన్ ఏర్పాటుకు తాను కృషి చేశానని, త్వరలో గని ప్రారంభమవుతుందని చెప్పారు.
సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తాను కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరామని, సింగరేణికి తాడిచర్ల-2, మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. 1995లో బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లిన సింగరేణిని కాపాడేందుకు కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం ఇప్పించి లక్ష మంది ఉద్యోగులకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కార్ జీవో నంబర్ 76పై ఉన్న స్టేను తొలగించిందని, త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. మారుపేర్ల సవరణ, డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం ఇచ్చేందుకు సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, చెన్నూరు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్లు పెద్దింటి పద్మ, దావ స్వాతి, సింగరేణి డీజీఎం పర్సనల్ అశోక్, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేశ్, రెస్క్యూ స్టేషన్ ఇన్చార్జి రాంమోహన్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్, సింగరేణి గుర్తింపు సంఘం లీడర్లు పాల్గొన్నారు.
రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు..
చెన్నూరు నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమర్రిలో ఏజెన్సీ యాక్ట్ అమలులో ఉన్నందున భూ యాజమాన్యపు హక్కులు లేవన్నారు. సింగరేణి 20 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామన్నారు.
మందమర్రిలో 50 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని, చెన్నూరులో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని నవంబర్ మొదటివారంలోపు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.100 కోట్లతో మందమర్రిలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు, అమృత్ స్కీం పనులు మరో ఆరు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. 2,500 మంది విద్యార్థుల కోసం రూ.200 కోట్లతో చెన్నూరు మండలం సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నట్టు, మందమర్రిలోని మోడల్ స్కూల్లో రూ.10 కోట్లతో కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసినట్టు చెప్పారు.
