- ప్రపంచ చమురు వాణిజ్యాన్ని మార్చే శక్తి ఆ సంస్థ సొంతమని కామెంట్
- విభిన్న రకాల క్రూడ్ ఆయిల్ శుద్ధిలో రిలయన్స్ పాత్ర కీలకం
- భారత్కు నష్టం కలిగించేలా పాక్తో సంబంధాలు ఉండవని హామీ
- త్వరలోనే భారత్, అమెరికా ట్రేడ్ డీల్ కొలిక్కి వస్తుందని వెల్లడి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అసాధారణమైన చమురు శుద్ధి(రిఫైనింగ్) సామర్థ్యం కలిగిన సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. ఇంధనమనేది ప్రస్తుతం దేశ భద్రతతో ముడిపడిన అంశమని.. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత వల్ల ఆర్థిక వ్యవస్థలే దెబ్బతినే ప్రమాదం నెలకొందని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు, వాటిచుట్టూ ఉన్న కరేబియన్ దీవులు, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల భాగాలతోపాటు అమెరికా, వెనిజులా వంటి దేశా(వెస్ట్రన్ హెమిస్పియర్)ల నుంచి వచ్చే భారీ ముడిచమురును శుద్ధి చేయడానికి రిలయన్స్ వంటి భారీ రిఫైనరీ సంస్థలతో కలిసి పనిచేయడం భారత్, అమెరికా దేశాలకూ ప్రయోజనకరమని చెప్పారు.
బుధవారం గుజరాత్లోని రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీని సందర్శించడానికి ముందు ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రూబియో మాట్లాడుతూ..‘ముడిచమురును శుద్ధి చేయకపోతే అది నిరుపయోగం. భారతదేశ ఇంధన రంగంలో కలిసి పనిచేయాలని అమెరికా భావిస్తోంది. దీనికి రిలయన్స్ సంస్థకున్న అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యం ఎంతో కీలకం. ఈ నైపుణ్యమే ఇరుదేశాల మధ్య ఇంధన సహకారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. రిలయన్స్ రిఫైనింగ్ సామర్థ్యం ప్రపంచ చమురు వాణిజ్యాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది’ అని ప్రశంసించారు.
జామ్నగర్ అతిపెద్ద కాంప్లెక్స్
గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనింగ్ కాంప్లెక్స్ అని రూబియో తెలిపారు. కొన్ని దేశాల్లో తేలికపాటి చమురు దొరికితే, వెనిజువెలా వంటి దేశాల్లో చాలా చిక్కగా, బరువైన ముడి చమురు లభిస్తుందన్నారు. ప్రపంచంలోని చాలా రిఫైనరీలు కేవలం ఒకేరకమైన చమురును మాత్రమే శుద్ధి చేయగలవని.. కానీ, రిలయన్స్ సంస్థ మాత్రం ఒక్కచోటే తేలికపాటి చమురుతో పాటు బరువైన, చిక్కనైన చమురును కూడా శుద్ధి చేయగలదని తెలిపారు.
దీనివల్ల ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి చమురు తక్కువ ధరకు దొరికినా, ఏ ప్రాంతంలో యుద్ధాలు లేదా రాజకీయ ఇబ్బందులు వచ్చి సరఫరా నిలిచిపోయినా.. రిలయన్స్ మాత్రం ఇబ్బంది పడకుండా వేరే దేశాల నుంచి ఎలాంటి చమురునైనా సులభంగా కొనుగోలు చేసి ప్రాసెస్ చేసుకోగలదని వివరించారు. ఈ అద్భుతమైన వెసులుబాటే ఆ కంపెనీకి అతిపెద్ద బలం అని రూబియో చెప్పారు.
అమెరికాలోనూ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచే దిశగా రిలయన్స్ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇరుదేశాలకు ఎంతో సహాయకారిగా ఉంటాయని రూబియో పేర్కొన్నారు. వెనిజువెలాలో ఉత్పత్తి పెరిగినప్పుడు అక్కడి భారీ ముడి చమురును శుద్ధి చేయడంలో రిలయన్స్ అనుభవం భారత్కు ఉపయోగపడుతుందని, కొనుగోళ్లు మాత్రం లభ్యత, వాణిజ్య నిబంధనలు, ఆంక్షలపైనే ఆధారపడి ఉంటాయని రూబియో స్పష్టం చేశారు.
భారత్తో బంధానికి భంగం కలిగించం
భారత్కు నష్టం కలిగించేలా పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు ఉండవు రూబియో భరోసా ఇచ్చారు. ఇతర దేశాలతో తమకు ఉన్న సంబంధాలు భారత్కు నష్టం కలిగించేలా ఉండవని స్పష్టంచేశారు. తాము భారత్లో పర్యటించడం, వాణిజ్య ఒప్పందాల కోసం కట్టుబడి ఉండటం, ఇరుదేశాలు కలిసి ఎన్నో పనులు చేయడం ఇందుకు స్పష్టమైన నిదర్శనమన్నారు. 1970ల నాటి ప్రచ్ఛన్న యుద్ధ(కోల్డ్ వార్) కాలంతో ప్రస్తుత అమెరికా విధానాన్ని పోల్చడం సరికాదన్నారు. అప్పట్లో పరిస్థితులు వేరని, ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించడం అంత సులువు కాదని రూబియో పేర్కొన్నారు.
అది భారత అంతర్గత వ్యవహారం
భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు దేశ అంతర్గత వ్యవహారమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని, భారత రాజకీయాలపై వ్యాఖ్యానించబోనని తెలిపారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్లో ఉన్న రూబియో.. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు, రాజకీయ చర్చలు సహజమన్నారు. అమెరికాలోనూ ప్రతిరోజూ నిరసనలు జరుగుతుంటాయని చెప్పారు. ఏ దేశంలోనైనా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం చర్చలకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.
