- మరోసారి సత్తా చాటిన వరంగల్ బిడ్డ
- దీప్తి జీవాంజికి వరుసగా రెండోసారి ఆసియా పారా గేమ్స్ లో గోల్డ్ మెడల్
- 400 మీటర్ల పరుగులో - 56.36 సెకన్లలో లక్ష్యానికి చేరి రికార్డ్
నాగోయా : తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజి ఆసియా పారా గేమ్స్‌లో మరోసారి సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సాధించింది. మంగళవారం జరిగిన పోటీలో 56.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కొత్త గేమ్స్ రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే ఆసియా రికార్డు సొంతం చేసుకున్న దీప్తి.. మరోసారి ఖండాంతర స్థాయిలో తన ఆధిపత్యాన్ని చాటింది.ఈ పోటీలో జపాన్‌కు చెందిన నీనా కన్నో 58.92 సెకన్లతో రజతం గెలవగా, అదే దేశానికి చెందిన అకానే కటో 1:00.26 నిమిషాలతో కాంస్య పతకం సాధించింది. తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన దీప్తి ప్రతిభను పాఠశాలలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గుర్తించారు. 23 ఏళ్ల దీప్తి 2024 పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది.
పారిస్ పారాలింపిక్స్‌లోనూ ఇదే విభాగంలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్, పారాలింపిక్స్ విజయాల తర్వాత ఆసియా పారా గేమ్స్‌లోనూ వరుసగా రెండో స్వర్ణంతో తన ప్రతిభను నిరూపించింది. దీప్తి తల్లిదండ్రులు మారుమూల గ్రామంలో చిన్న రైతులుగా జీవిస్తున్నారు. వ్యవసాయంతో పాటు కూలి పనులు కూడా చేస్తూ కుమార్తె ఆశయాలకు అండగా నిలిచారు. ఆమె క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహించినందుకు గ్రామస్థుల నుంచి విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పట్టుదలతో దీప్తి అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది.
