నీటి సంరక్షణతో విద్యుత్ పొదుపు...సేంద్రీయ పద్ధతుల్లో సాగు పెంచాలి

నీటి సంరక్షణతో విద్యుత్ పొదుపు...సేంద్రీయ పద్ధతుల్లో సాగు పెంచాలి
  • నీళ్లు ఎక్కువగా ఉపయోగించే పంటలు వేయొద్దు
  • సదరన్​ డిస్కమ్​ సీఎండీ జితేశ్​ వి.పాటిల్​
  • యాదాద్రి జిల్లాలో రైతులతో సీఎండీ జితేశ్ ​వి.పాటిల్​ ముఖాముఖి 

హైదరాబాద్​, వెలుగు: నీటి వినియోగాన్ని తగ్గించే పంటల సాగు వల్ల భూగర్భ జలాల సంరక్షణకు, వ్యవసాయ విద్యుత్ పొదుపునకు దోహదపడుతుందని సదరన్​ డిస్కమ్​ సీఎండీ జితేశ్ ​వి.పాటిల్​ అన్నారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులు ఎక్కువగా దృష్టి సారించాలన్నారు.

 బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, చినరావులపల్లి, బట్టుగూడెం,  వలిగొండ మండలం మందాపురం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తూ అక్కడే రైతులతో మాట్లాడారు. వ్యవసాయ పరిస్థితులు, పంటల సాగు విధానాలు, నీటి లభ్యత, వ్యవసాయ విద్యుత్ అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.

 వ్యవసాయ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలను పరిశీలించి, విద్యుత్​ సమస్యలకు కారణమయ్యే వాటిని గుర్తించి పరిష్కరించాలని డిస్కమ్​ స్టాఫ్​కు ఆదేశించారు. ఎక్కువ నీళ్లు ఉపయోగించే సంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా మునగ, వివిధ రకాల కూరగాయలు, చిరుధాన్యాలు వంటి పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. 

వరి సాగుకు అయ్యే పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు, నీరు, విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, మేకల పెంపకం వంటి అనుబంధ రంగాలపై కూడా రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్. నరసింహులు, చీఫ్ ఇంజినీర్ యు. బాలస్వామి, యాదాద్రి సూపరింటెండింగ్ ఇంజినీర్ కె. సురేశ్ కుమార్, డీఈ ఎస్. వెంకటేశ్వర్లు,   సర్పంచులు పాల్గొన్నారు.