చాలామందికి రోజూ గుడ్డు తినవచ్చా ? పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? అనే అనుమానాలు ఉంటాయి. వీటిపై ఎయిమ్స్ ప్రముఖ డాక్టర్ కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. అయితే వరుసగా రెండు వారాల పాటు రోజుకో గుడ్డు తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో లుసా తెలుసా...
1. జ్ఞాపకశక్తి
గుడ్డులో 'కోలిన్' అనే పోషకం ఉంటుంది. ఇది మన మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, ఏకాగ్రత పెంచడానికి చాలా సహాయపడుతుంది.
2. కొలెస్ట్రాల్
గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది భయపడతారు. కానీ, డాక్టర్ల ప్రకారం గుడ్డు తినడం వల్ల శరీరానికి మేలు చేసే HDL అనే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
3. కంటి చూపు
గుడ్డు పచ్చసొనలో కళ్లను రక్షించే 'ల్యూటిన్', 'జీక్సాంథిన్' అనే పదార్థాలు ఉంటాయి. ఇవి ఫోన్ల నుండి వచ్చే నీలి కాంతి ప్రభావం పడకుండా కళ్లను కాపాడుతాయి.
4. చర్మం, జుట్టు
గుడ్డులో ఉండే అమైనో ఆమ్లాలు మన జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన 'కెరాటిన్' అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
పచ్చసొనలో ఎన్నో పోషకాలు
చాలామంది కొలెస్ట్రాల్ భయంతో కేవలం తెల్లసొన మాత్రమే తింటారు. కానీ డాక్టర్ల అభిప్రాయం ప్రకారం గుడ్డులోని అసలైన పోషకాలన్నీ (విటమిన్ A, E, ఒమేగా-3) పచ్చసొనలోనే ఉంటాయి. పచ్చసొన తింటేనే గుడ్డు సంపూర్ణ ఆహారంగా మారుతుంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి, కణాల నిర్మాణానికి పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ అవసరం. ఒకవేళ మీరు అసలు గుడ్లే తినకపోతే.. సోయా పనీర్, సోయా గింజలు వంటివి ప్రోటీన్ కోసం తీసుకోవచ్చు.
