పచ్చి బటానీలతో ఈ రెసిపీలు చేసుకొని తింటే ...

పచ్చి బటానీలతో ఈ రెసిపీలు చేసుకొని తింటే ...

ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరి... ప్రతి ఇంట్లో కామన్​గా కనిపించే బ్రేక్​ఫాస్ట్​ మెనూ ఇది. అయితే వీటిని ఎంత టేస్టీగా వండినా.. రోజూ  తినాలంటే బోర్​ కొడుతుంది ఎవరికైనా. అదే పిల్లలైతే అస్సలే తినరు. ఇన్​స్టంట్​ బ్రేక్​ఫాస్ట్​ ఆప్షన్స్​ ఉన్నా అవి ఎంత వరకు హెల్దీ అన్నది చెప్పలేం. అందుకే అప్పుడప్పుడు బ్రేక్​ఫాస్ట్​లో  రుచిని, ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసే కొత్త వంటలు ట్రై చేయాలి. అందుకు బెస్ట్​ ఆప్షన్​ ఈ పచ్చిబటానీ రెసిపీలు.  

సాధారణంగా పచ్చి బటానీలని కూరల్లో గ్రేవీ కోసం వాడుతుంటారు. పులావ్, కిచిడి, బిర్యానీల్లోనూ వేస్తుంటారు. అలాకాకుండా అచ్చంగా  పచ్చి బటానీలతో ఈ రెసిపీలు చేసుకొని తింటే బోలెడు లాభాలున్నాయి. వారానికోసారైనా అర కప్పు పచ్చి బటానీ తింటే 364 కేలరీలు, 19.3 గ్రాములు ప్రొటీన్​, 17.6 గ్రాముల డైటరీ ఫైబర్, 10 గ్రాముల నేచురల్​ షుగర్స్​ శరీరానికి అందుతాయి. ఇవి బాడీలో  కొలెస్ట్రాల్  లెవల్స్​ని తగ్గించడానికి సాయం చేస్తాయి. రోజువారీ అవసరాలకి సరిపడా అమైనో యాసిడ్స్​ని అందిస్తాయి.  మెటబాలిజంని హెల్దీగా ఉంచడంతో పాటు బ్లడ్​ షుగర్​ లెవల్స్​ని అదుపులో ఉంచుతాయి​. మరిన్ని లాభాలున్న గ్రీన్​పీస్​ రెసిపీలు ఎలా తయారు చేసుకోవాలంటే.. 

గ్రీన్​ పీస్​ చిల్లా

కావాల్సినవి: పచ్చి బటానీ– అర కప్పు, పచ్చిమిర్చి పేస్ట్​– ఒక టీ స్పూన్​, శనగపిండి– ఒక టీ స్పూన్​, పెరుగు– రెండు టీ స్పూన్​లు, ఉల్లిగడ్డ పేస్ట్​(కచ్చాపచ్చాగా)– ఒక టేబుల్​ స్పూన్, బేకింగ్​ పౌడర్​– పావు టీ స్పూన్​, టొమాటో, ఉల్లిగడ్డ తరుగు– ఒక్కోటి పావు టేబుల్ స్పూన్​ చొప్పున, క్యాప్సికం – నాలుగు ముక్కలు, పల్లీలు ( వేగించి)– ఒక కప్పు, ఉప్పు– సరిపడా తయారీ: ప్రెజర్​ కుక్కర్​లో పచ్చి బటానీలు వేసి, రెండు కప్పుల నీళ్లు పోయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి, రెండు నుంచి మూడు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించాలి. నీళ్లు వంపేసి  బటానీలు గిన్నెలోకి తీయాలి. అందులో పచ్చిమిర్చి పేస్ట్​, శనగపిండి,  కచ్చాపచ్చాగా దంచిన ఉల్లిగడ్డ పేస్ట్​ వేసి చేత్తో లేదా పప్పు గుత్తితో బాగా కలపాలి. పాన్​లో నూనె వేడిచేసి, దానిపై ఆ మిశ్రమాన్ని నచ్చిన షేప్​లో  పరవాలి. పైనుంచి ఉల్లిగడ్డ, క్యాప్సికం, టొమాటో, వేగించి.. నలిపిన పల్లీలు వేసి ఒక నిమిషం మూత పెట్టాలి. చిల్లాను  రెండో వైపు కూడా కాల్చి తింటే  టేస్టీగా ఉంటుంది. 

రెగ్యులర్​గా తింటే.. 

  • వీటిల్లోని ఫైబర్​ వల్ల చాలాసేపటి వరకు కడుపు నిండుగా ఉండి త్వరగా ఆకలి వేయదు. బరువు కూడా కంట్రోల్​లో ఉంటుంది. 
  • ఏదో ఒక రూపంలో రోజూ  గుప్పెడు పచ్చిబటానీలు తింటే.. ఐరన్​ లోపం దరిచేరదు. దానివల్ల గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. జుట్టు , చర్మం మెరుస్తుంది.
  • పచ్చి బటానీల్లోని ఫోలెట్​, విటమిన్​–బి9 డిప్రెషన్​ నుంచి బయటపడేస్తాయి. 
  • వీటిల్లోని పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బుల నుంచి కాపాడతాయి.

​ గ్రీన్​ పీస్​ చట్​పట్

కావాల్సినవి:  పచ్చి బటానీలు(ఉడికించి)– రెండు కప్పులు, టొమాటో తరుగు– రెండు టీ స్పూన్​లు, ఉల్లిగడ్డ తరుగు– రెండు టీ స్పూన్​లు, పచ్చిమిర్చి తరుగు– రెండు టీ స్పూన్​లు​, నూనె– ఒక టేబుల్ స్పూన్​, ఉప్పు, కారం– సరిపడా, కొత్తిమీర– కొద్దిగా, జీలకర్ర పొడి– ఒక టీ స్పూన్​, నిమ్మరసం, టొమాటో సాస్​– ఒక్కోటి ఒక్కో  టేబుల్​ స్పూన్​ చొప్పున, సన్నకారప్పూస– కొద్దిగా
తయారీ: పాన్​లో నూనె వేడిచేసి  పచ్చిమిర్చి తరుగు, ఉడికించిన పచ్చి బటానీలు వేసి వేగించాలి. అందులో ఉల్లిగడ్డ  తరుగు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, టొమాటో సాస్​ వేసి మరికాసేపు వేగించాలి. తర్వాత స్టవ్ ఆపి టొమాటో తరుగు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి.  ఆపై సన్నకారప్పూసతో గార్నిష్​ చేసుకుంటే గ్రీన్​పీస్ చట్​పట్​ రెడీ.