టాప్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ

టాప్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ

దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు టాప్ ర్యాంకులు ప్రకటించింది నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్​ ర్యాంకింగ్ ఫ్రేమ్‌‌వర్క్.ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించింది క్వాక్వారెల్లి సైమండ్స్ సంస్థ.రెండింటిలోనూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్‌‌
టాప్‌‌లో నిలిచాయి.వీటితోపాటు ఈ ర్యాంకింగ్స్‌‌లో టాప్‌‌లో నిలిచిన ఐఐటీలు ఏవి? తెలంగాణ నుంచి టాప్ ర్యాంకు దక్కించుకున్న యూనివర్సిటీలు, టాప్ ర్యాంక్స్ వివరాలు..

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యాసంస్థల్లోని ప్రమాణాలకు కేటాయించే ర్యాంకులను ఇండియా ర్యాంకింగ్స్– 2020 పేరుతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఐఐటీ–మద్రాస్ అత్యధికంగా 85.31 స్కోర్‌‌తో తొలిస్థానంలో నిలిచింది. బెంగళూరులోని ఐఐఎస్సీ రెండు, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై వరుసగా 3, 4 స్థానాలు దక్కించుకున్నాయి. మన రాష్ర్టం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 15, ఐఐటీ హైదరాబాద్ 17 ర్యాంకులు పొందాయి. ఎన్‌‌ఐటీ వరంగల్‌‌కు 46, ఉస్మానియా యూనివర్సిటీకి 53వ ర్యాంకు దక్కింది. ఏపీ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ 36, ఎస్‌‌వీయూ 68 ర్యాంకుల్లో నిలిచాయి. ఓవరాల్ ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 7 విద్యాసంస్థలకు స్థానం దక్కింది.

100 సంస్థలకు స్కోర్​..

యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మేనేజ్‌‌మెంట్, ఫార్మసీ, కాలేజ్, మెడికల్, లా, ఆర్కిటెక్చర్, డెంటల్ వంటి 10 కేటగిరీల్లో ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణలోని 28, ఆంధ్రప్రదేశ్‌‌లోని 30 ఇన్‌‌స్టిట్యూషన్స్ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. ఓవరాల్‌‌, యూనివర్సిటీ, ఇంజినీరింగ్‌‌ కేటగిరీల్లో మన ఇన్‌‌స్టిట్యూషన్స్ చెప్పుకోదగ్గ ర్యాంకులు పొందినా మేనేజ్‌‌మెంట్‌‌, ఫార్మసీ, లా, మెడికల్‌‌, ఆర్కిటెక్చర్‌‌, డెంటల్‌‌, కాలేజ్ కేటగిరీల్లో అంతగా రాణించలేదని చెప్పవచ్చు. ర్యాంకుల కేటాయింపునకు గాను టీచింగ్ లెర్నింగ్ అండ్ రీసోర్సెస్, (టీఎల్‌‌ఆర్) రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ (ఆర్‌‌పీ), గ్రాడ్యుయేషన్ అవుట్‌‌కమ్స్(జీవో), అవుట్‌‌రీచ్ అండ్ ఇన్‌‌క్లూజివిటీ (ఓఐ), పీర్ పర్‌‌సెప్షన్ (పీఆర్) వంటి పారామీటర్స్ తో పాటు వాటిలోని 17 సబ్ పారామీటర్స్ ను పరిశీలించారు. ఓవరాల్ కేటగిరీలో 100  సంస్థలకు స్కోర్స్ ఇచ్చారు.