
హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యే రాకేష్ దౌల్తాబాద్ గుండెపోటుతో కన్నుమూశారు. గురుగ్రామ్‌లో ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం పాలెం విహార్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దౌల్తాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన రాకేష్.. ఆ తరువాత బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
ఎమ్మెల్యే రాకేష్ ఆకస్మిక మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రాకేష్ తన కృషి, అంకితభావంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారని కొనియాడారు. ఆయన మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి అంటూ మోదీ ట్వీట్ చేశారు.
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ కూడా రాకేష్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాకేష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.