- గేట్లు మూసేసీ బోర్డు ఏర్పాట్లు
- బొయ్యారం బయటపడటంతో అలెర్ట్
- మీడియాను కూడా రానీయట్లేదు
- ఇంకా ఎలాంటి లోపాలున్నాయోనని అనుమానాలు
భూపాలపల్లి: మేడిగడ్డపై ఎల్అండ్ టీ సంస్థ నిషేధాజ్ఞలు విధించింది. గేట్లు బంద్ చేసి ప్రాజెక్టు పైకి ఎవరినీ వెళ్లనీయడంలేదు. ముఖ్యంగా మీడియాను కూడా అనుమతించడం లేదు. రిపేర్లు చేస్తుండగా బ్యారేజీ 20, 21వ పియర్ల పక్కన భారీ బొయ్యారం బయటపడటం.. మీడియాలో రావడంతో అప్రమత్తమైన ఎల్అండ్ టీ సంస్థ ఇవాళ గేట్లు క్లోజ్ చేసింది. అనుమతి ఉన్న వ్యక్తులకు తప్ప మిగతా వారెవరికీ ప్రవేశం లేదంటూ బోర్డు ఏర్పాటు చేసింది. 20, 21వ పియర్ల మధ్య బయటపడిన పిల్లర్లకు అతిదగ్గరగా బొయ్యారం ఏర్పడింది.
గోదావరిలో ఇప్పుడు వస్తున్న రెండు వేల క్యూసెక్కుల వరద తాకిడికే ఇసుక కొట్టుకుపోవడం గమనార్హం. భారీగా వరద వస్తే ఏమిటి..? ఇంతకూ ప్రాజెక్టు ఉంటుందా..? పేక మేడలా పడిపోతుందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానిని కప్పి పుచ్చుకొనేందుకు ఇంజినీర్లు బొయ్యారంలో నల్లమట్టిని నింపారు. అయితే ఇవాళ ఉదయం గేట్లు మూసేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఏమైనా భారీ లోపాలు బయటపడ్డాయా..? మీడియా కంట పడకుండా రిపేర్లు చేసేందుకే నిషేధాజ్ఞలు విధించారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేట్లు మూసేయడంతోపాటు అక్కడ ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ప్రైవేటు సెక్యూరిటీ
మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ మరమ్మతులకు ఎల్అండ్ టీ సంస్థ ఉపక్రమించింది. గతంలో పగుళ్లు ఏర్పడ్డ ప్రదేశంలో మరమ్మతులు చేస్తున్న క్రమంలో కొత్త లోపాలు బయటపడుతుండటంతో ఆ సంస్థ ఇంజినీర్లు తలలు పట్టుకుంటున్నారు. చిన్నపాటి వరద వస్తేనే బొయ్యారాలు బయపడుతుండటం, అవి మీడియాలో రావడంతో టెన్షన్ పడ్డ అధికారులు బొరియల ప్రదేశాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పేర్కొంటూ కొద్ది దూరం వెడల్పు నుంచి ఎర్ర రిబ్బన్స్ కట్టారు. ఇవాళ ఉదయం ఏకంగా గేట్లు మూసేయడం, అనుమతి లేని వ్యక్తులకు ఎంట్రీ లేదంటూ బోర్డు వేయడం గమనార్హం. దీంతో ఇంకా ఏమైనా భారీ లోపాలు బయటపడ్డాయా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టు ఇంతకూ పనికొస్తుందా..? వరద వస్తే పేకమేడలా కూలిపోతుందా..? అన్న చర్చకూడా మొదలైంది.