గతకొంత కాలంగా వీధికుక్కల సమస్య దేశం అంత చర్చనీయాంశంగా మారింది. వీధికుక్కల దాడులు రోజురోజుకి పెరిగిపోతుండటం, వీధికుక్కలు చిన్నారులపై దాడులు చేయడం పై సుప్రీంకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా వీధికుక్కల దాడులకు సంబంధించిన కేసు విచారిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక జంతువు కరిచే మూడ్ లో ఉన్నప్పుడు దాని ప్రవర్తనను ఎవరూ అంచనా వేయలేరని, కాబట్టి నివారణే మార్గమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. స్కూల్స్, ఆసుపత్రులు, కోర్టు ప్రదేశాలు వంటి సున్నితమైన ప్రాంతాల్లో వీధికుక్కలు ఉండాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది.
ఉదయం ఏ కుక్క ఏ మూడ్‌లో ఉందో మనకు తెలియదు. కేవలం ప్రవర్తన ద్వారా ప్రమాదకరమైన కుక్కలను గుర్తించడం అసాధ్యం అని జస్టిస్ విక్రమ్ నాథ్ పేర్కొన్నారు. స్కూల్స్, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలు వీధులు కావని, అక్కడ ప్రజల రక్షణ దృష్ట్యా కుక్కలను అనుమతించకూడదని జస్టిస్ మెహతా అభిప్రాయపడ్డారు.
2025లో ఆసుపత్రులు, స్కూల్స్ వంటి ప్రాంతాల్లో కుక్క కాటు కేసులు పెరగడంతో ఈ ప్రాంతాల నుంచి కుక్కలను తొలగించి, తగిన టీకాలు, స్టెరిలైజేషన్ తర్వాత విధి కుక్కల షెల్టర్లకి తరలించాలని ఆదేశించింది. రాష్ట్ర, జాతీయ రహదారులు అలాగే ఎక్స్‌ప్రెస్‌వేల నుండి పశువులు ఇతర వీధి జంతువులను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించింది.
