ఈ మధ్యకాలంలో ఓట్స్ వాడకం ఎక్కువైంది. ఒకప్పుడు బరువు తగ్గడానికి ఉపయోగించే ఓట్స్... ఇప్పుడు అందరి మెనూలో వచ్చి చేరింది. విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లంతా తమ ఓటు ఓట్స్ కే. అంటున్నారు. మరింకెందుకు ఆలస్యం... వెంటనే ఈ ఓట్స్ వంటలను మీరూ ట్రై చేయండి.
గార్లిక్ ఓట్స్ విత్ ఎగ్ తయారీకి కావలసినవి
- ఓట్స్: 1 కప్పు
- నీళ్లు: 3 కప్పులు
- వెల్లుల్లి తరుగు : 2 టీస్పూన్లు
- ఆలివ్ ఆయిల్:1 టీస్పూన్
- గుడ్లు: రెండు
- కారంపొడి :అర టీస్పూన్
- ఉప్పు : తగినంత
- మిరియాల పొడి: చిటికెడు
- చీజ్ తురుము: పావు కప్పు
- కొత్తిమీర తరుగు: పావు కప్పు
గార్లిక్ ఓట్స్ విత్ ఎగ్ తయారీ విధానం
ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక నూనె వేయాలి. అందులో వెల్లులి తరుగు, ఓట్స్ వేసి వేగించాలి..
తర్వాత నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఛీజ్ వేసి దింపేయాలి. గుడ్లను ఆఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకుని, ఓట్స్ మిశ్రమంపై వేయాలి.
చివరగా మిరియాల పొడి, కారం పొడి, కొత్తిమీర తరుగు చల్లుకుని సర్వ్ చేయాలి
ఓట్స్ పాన్ కేక్ తయారీకి కావలసినవి
- ఉడికించి చిదిమిన బీట్ రూట్ :1 కప్పు
- ఉల్లి గడ్డ : 1 (మీడియమ్)
- పచ్చిమిర్చి :తరుగు 2 టీస్పూన్లు
- అల్లం తరుగు :అర టీస్పూన్
- జీలకర్ర: అర టీస్పూన్
- ధనియాల పొడి: అర టీస్పూన్
- ఇంగువ :చిటికెడు
- పెరుగు :అర కప్పు
- ఓట్స్: అర కప్పు
- బియ్యప్పిండి: పావుకప్పు
- శెనగపిండి: పావు కప్పు
- నూనె: సరిపడా
- ఉప్పు : తగినంత
ఓట్స్ పాన్ కేక్ తయారీ విధానం
ముందుగా అన్ని పదార్థాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. కావాలనుకుంటే కొన్ని నీళ్లు కలపొచ్చు. పొచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిని ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. ఇది వేడెక్కాక నూనె వేసి పిండితో దోసెలు వేయాలి కొద్దికొద్దిగా నూనెను చల్లుతూ రెండు వైపులా కాల్పాలి. వీటిని ఏదైనా చట్నీతో తినొచ్చు.
ఓట్స్ధోక్లా రెసిపీ తయారీకి కావలసినవి
- శెనగపిండి : 1 కప్పు
- బొంబాయిరవ్వ :2టేబుల్ స్పూన్లు
- ఓట్స్ పిండి (ఓట్ మిక్సీలో వేసి పొడి చేయాలి): అరకప్పు
- చక్కెర :అర కప్పు
- పసుపు :చిటికెడు
- ఉప్పు :తగినంత
- నీళ్లు :2 కప్పులు
- వంట సోడా : కొద్దిగా
- నూనె : 2 టేబుల్ స్పూన్లు
- ఇంగువ :చిటికెడు
- ఆవాలు :పావు టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు :1 టీస్పూన్
- కరివేపాకు :1 రెమ్మ
- చక్కెర: 2 టీస్పూన్లు
ఓట్స్ధోక్లా రెసిపీ తయారీ విధానం
ముందుగా ఇడ్లీ లేదా ఢోక్లా పాత్రలో కప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు చిన్న మంటపై ఉంచి, డోకా కోసం వంటసోడా తప్ప మిగిలిన పదార్ధాలన్నీ కలిపి పెట్టుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత వంటసోడా కూడా కలిపి ఢొక్లా పాత్రకు నూనె రాసుకుని అందులో పిండిని వేయాలి.
కనీసం ఇరవై నిమిషాలు ఉడికించి దింపేయాలి. డోక్లాను వెంటనే తీయకుండా కాసేపు చల్లార్చి ముక్కలుగా చేయాలి. ఇప్పుడు ఒక పాన్ లో ఇంగువ, ఆవాలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. కొద్దిగా నీళ్లు వేసి వేడయ్యాక చక్కెర వేయాలి.
అందులో డోక్లా ముక్కలు వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత వాటిని సర్వ్ చేసుకోవచ్చు.
–వెలుగు లైఫ్–
