సూర్యాపేట జిల్లాలో వడ్ల పైసలు ఎగవెట్టి సిన్మాలు తీస్తుండు!

సూర్యాపేట జిల్లాలో వడ్ల పైసలు ఎగవెట్టి సిన్మాలు తీస్తుండు!
  • సూర్యాపేట జిల్లాలో ఓ రైస్ మిల్లర్ నిర్వాకం.. సీఎంఆర్ కింద రెండేళ్లలో రూ.200 కోట్ల బకాయిలు
  •     చర్యలు తీసుకోకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నడు

సూర్యాపేట, వెలుగు: ఆయన ఓ రైస్​మిల్లర్. బీఆర్ఎస్ హయాంలో ‘సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా చక్రం తిప్పిండు. అప్పటి సర్కారు పెద్దల అండతో తనకున్న రైస్​మిల్లుల కెపాసిటీకి మించి సీఎంఆర్​వడ్లు కేటాయించుకున్నడు. వాటిని మరాడించి, బయట అమ్ముకొని వందల కోట్లు వెనుకేసుకున్నడు. ప్రభుత్వానికి ఏకంగా రూ.200 కోట్లు బాకాయి పెట్టిండు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి, ఆస్తులను జప్తు చేసేందుకు ప్రయత్నిస్తే, కోర్టు నుంచి స్టే ఆర్డర్​తెచ్చుకున్నడు. ఇప్పుడాయన ఓ తెలుగు సినిమా తీయడం సంచలనంగా మారింది.

గత ప్రభుత్వ పెద్దల అండతో..  

గత బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్మిడి సోమనర్సయ్య నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో చెలరేగిపోయారు. ఆయనకు చెందిన సంతోషి మాతా, రఘురామ రైస్ మిల్లులకు కెపాసిటీకి మించి కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని కేటాయించుకొని మరాడించిన బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2022–23, 2023–-24 రబీ, ఖరీఫ్ సీజన్లలో మరాడించిన సుమారు రూ.500 కోట్ల బియ్యాన్ని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నాడు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన మీద ఈగవాలనీయలేదు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశాలతో సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేశారు. బియ్యం అమ్ముకున్న మిల్లులపై కేసులు నమోదు చేయడంతోపాటు ఆస్తులను జప్తుచేశారు. ఈ క్రమంలో ఇమ్మిడి సోమ నర్సయ్యకు చెందిన రఘురామ, సంతోషి మాత మిల్లుల్లోనూ అధికారులు తనిఖీ చేపట్టగా 85,800 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. 

ఇందులో సంతోషి మాతా రైస్ మిల్లుకు చెందిన రూ.99.93 కోట్ల విలువైన 40,435 మెట్రిక్ టన్నులు, రఘురామ రైస్ మిల్ చెందిన  రూ.89.97 కోట్ల విలువైన 45,362 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. కట్టాల్సిన వడ్డీతో కలిపి ఈ మొత్తం రూ.200 కోట్లు దాటింది. అడ్డదారిలో సీఎమ్మార్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన సోమనర్సయ్య, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ను ఆశ్రయించారు. సుమారు రూ.200 కోట్ల సీఎమ్మార్ ధాన్యం పెండింగ్ లో ఉండడంతో అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులను జప్తు  చేసేందుకు ప్రయత్నించగా గతేడాది ఆగస్టు నెలలో హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ​తెచ్చుకున్నారు.

ప్రభుత్వానికి డబ్బులు  చెల్లించకుండా.. ఇతర వ్యాపారాలు

సర్కారుకు రూ.200 కోట్లు బాకీ పడి పైసా చెల్లించకుండా తప్పించుకుంటున్న సోమనర్సయ్య ఇటీవల ఓ తెలుగు సినిమా నిర్మించారు. రూ.10 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. సోమనర్సయ్య సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు. రిలీజ్ సందర్భంగా సూర్యాపేటలోని మల్టీ ప్లెక్స్ థియేటర్ మొత్తం బుక్ చేసి ఆయన కమ్యూనిటీ కి చెందిన వారికి ఫ్రీగా సినిమా చూపించారు. 

సోమనర్సయ్య సినిమా తీయడాన్ని తప్పు పట్టలేంగానీ, సర్కార్ కు కట్టాల్సిన రూ.200 కోట్ల సంగతేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సోమనర్సయ్య సహా ఇంకొందరు మిల్లర్లు సీఎమ్మార్ వడ్లను పక్కదారి పట్టించి ఆ డబ్బును ఇప్పటికే రియల్ ఎస్టేట్​లో పెట్టుబడి పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆ పైసలనే ఇలా సినిమాలు, ఇతర వ్యాపారాల కోసం వాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.