హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ చిత్ర నిర్మాతలు

హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ చిత్ర నిర్మాతలు

హైదరాబాద్: ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలకు అనుమతి కల్పించకుండా గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‎ను ఆశ్రయించారు రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు. 

సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసి టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‎ను అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. బుధవారం (జనవరి 7) ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. సినిమాల విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 

రాజా సాబ్ టికెట్ రేట్ ఎంతంటే..?

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఆ ప్రీమియర్ షో టికెట్ను.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 800 రూపాయలు (జీఎస్టీ అదనం), మల్టీప్లెక్స్ల్లో 1000 రూపాయలకు (జీఎస్టీ అదనం) అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అంతేకాకుండా.. జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. 

అంతేకాకుండా.. డే1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెగ్యులర్ టికెట్ ధరపై 102 రూపాయల పెంపును, మల్టీప్లెక్స్ టికెట్ ధరపై 132 రూపాయల పెంపును కోరుతూ ‘ది రాజా సాబ్’ సినిమా నిర్మాణ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రికి, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఈ లేఖ రాశారు. అయితే.. జనవరి 4న ఈ లేఖ రాసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికైతే స్పందన లేదు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే.. రాజా సాబ్ ప్రీమియర్ షో ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 800 రూపాయల పైమాటే.