రేబిస్ మరణాల్లో భారత్ టాప్.. కుక్క కరిస్తే వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు సేఫ్..

రేబిస్ మరణాల్లో భారత్ టాప్.. కుక్క కరిస్తే వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు సేఫ్..

దేశంలో కుక్కకాటు కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కల బెడద ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. 2024 లెక్కల ప్రకారం దేశంలో 37 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అందులో 54 మంది రేబిస్ కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్త రేబిస్ మరణాల్లో 36 శాతం వాటా ఒక్క భారతదేశానిదే కావడం గమనార్హం. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. ఢిల్లీ ప్రభుత్వం రేబిస్‌ను 'నోటిఫైడ్ వ్యాధి'గా ప్రకటించేందుకు సిద్ధమైంది. దీంతో రేబిస్ అనుమానిత కేసులు నమోదైన వెంటనే అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు తప్పనిసరిగా అధికారులకు నివేదించాల్సి ఉంటుంది.

కుక్క కరిచినప్పుడు శారీరక గాయంతో పాటు రేబిస్, సెప్సిస్, మెనింజైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. రేబిస్ ఒకసారి శరీరానికి సోకి లక్షణాలు బయటపడితే.. అది 100 శాతం ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే కుక్కకాటుకు గురైనప్పుడు మొదటి 24 గంటలు చాలా కీలకం.

కుక్క కరిచినప్పుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్స:

* కుక్క కరిచిన వెంటనే చేయాల్సిన అతి ముఖ్యమైన పని గాయాన్ని శుభ్రం చేయడం. ప్రవహించే నీటి కింద కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు సబ్బుతో గాయాన్ని కడగాలి. దీనివల్ల కుక్క లాలాజలంలోని వైరస్ ప్రభావం తగ్గుతుంది.

* గాయం నుంచి రక్తం కారుతుంటే శుభ్రమైన గుడ్డతో సున్నితంగా ఒత్తిడి పట్టాలి.

* గాయాన్ని కడిగిన తర్వాత ఆల్కహాల్ లేదా పోవిడోన్-అయోడిన్ వంటి యాంటిసెప్టిక్ లోషన్లను రాయాలి.

* గాయంపై బిగుతుగా కట్టు కట్టడం లేదా కుట్లు వేయడం వంటివి ప్రారంభంలో చేయకూడదు. ఇలా చేయడం వల్ల వైరస్ లోపలే ఉండిపోయే ప్రమాదం ఉంది.

Also Read : BMC ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా ? కొత్త రూల్.. గెలిస్తే ఏం చేస్తారో జస్ట్ రాసివ్వండి!

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? 
కుక్క కరిచిన 24 గంటలలోపు డాక్టర్‌ను కలిసి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది సాధారణంగా 0, 3, 7, 14, 28 రోజులలో 5 డోసులుగా ఇస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే 'రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్'ఇంజెక్షన్ నేరుగా గాయం వద్ద ఇస్తారు. అలాగే టెటానస్ ఇంజెక్షన్ కూడా తీసుకోవడం మర్చిపోకూడదు.

ఇక కుక్క కరిచిన గాయంపై కారం, నూనె, పసుపు, మట్టి, సున్నం లేదా ఇతర పదార్థాలను అస్సలు పూయకూడదు. ఇవి ఇన్ఫెక్షన్ తీవ్రతను పెంచుతాయి. ముఖ్యంగా 5 నుండి 14 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా కుక్కకాటుకు గురవుతుంటారు కాబట్టి.. వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుక్కకాటును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరైన చికిత్స తీసుకోవడమే ప్రాణరక్షణకు ఏకైక మార్గం అని వైద్యులు చెబుతున్నారు. సో కుక్క కాటుకు గురైనప్పుడు ఆందోళన చెందకుండా పైన చెప్పిన విధంగా ప్రాథమిక చికిత్స చేసుకుని వెంటనే వైద్యుడిని సంప్రదించటం సరైన పద్ధతి.