బెంగళూరు నగరంలో సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే సామాన్యులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. చిన్న ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతున్న కఠినమైన నిబంధనలను సడలిస్తూ పట్టణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 250 చదరపు మీటర్ల లోపు ఉన్న నివాస స్థలాలకు ఈ కొత్త 'సెట్‌బ్యాక్' (ఇంటి చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలం) నిబంధనలు వర్తించనున్నాయి.
సవరించిన మాస్టర్ ప్లాన్ (RMP 2015) ప్రకారం, ప్లాట్ సైజును బట్టి నిబంధనల్లో మార్పులు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే..
60 చ.మీ (20x30 అడుగులు): ఈ చిన్న ప్లాట్లకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటి వెనుక భాగంలో ఖాళీ స్థలం వదలాల్సిన అవసరం లేదు. ముందు వైపు కేవలం 0.7 మీటర్లు, పక్కల వైపు 0.6 మీటర్లు వదిలితే సరిపోతుంది.
150 చ.మీ (30x40 అడుగులు): ఈ పరిమాణం కలిగిన ప్లాట్లలో ముందు వైపు 0.9 మీటర్లు, వెనుక వైపు 0.7 మీటర్లు అలాగే ఒక పక్కన 0.7 మీటర్ల స్థలం వదిలి నిర్మాణం చేసుకోవచ్చు.
250 చదరపు మీటర్ల లోపు ఉన్న ప్లాట్లలో నిర్మించే భవనాల గరిష్ట ఎత్తును 12 మీటర్లకు (స్టిల్ట్ ఫ్లోర్ కాకుండా) పరిమితం చేశారు. అయితే ఒక ముఖ్యమైన నిబంధనను కూడా ప్రభుత్వం చేర్చింది. ఇంటి చుట్టూ వదిలిన ఖాళీ స్థలంలో సిమెంట్ కాంక్రీట్ లేదా గట్టి బండలు వేయకూడదు. వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జల మట్టం పెరిగేలా ఆ స్థలాన్ని వదిలేయాలని స్పష్టం చేసింది.
గతంలో ప్లాట్ సైజుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉండటంతో చిన్న స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. తాజా సవరణల వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ బిల్డబుల్ స్పేస్ లభిస్తుందని సివిల్ ఇంజనీర్లు, ప్లానర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ కోసం మెకానికల్ వ్యవస్థలను వాడుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. భద్రత విషయంలో రాజీ పడకుండా నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 నిబంధనలను పాటించడం మాత్రం తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయం బెంగళూరులో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను మరింత సులభతరం చేయబోతోంది.
